Begin typing your search above and press return to search.

ఘాటు మాట : వైఎస్సారూ.. ప్రాజెక్టులూ.. కమిషన్లూ...?

By:  Tupaki Desk   |   26 July 2022 2:09 PM IST
ఘాటు మాట :  వైఎస్సారూ.. ప్రాజెక్టులూ.. కమిషన్లూ...?
X
దివంగత నేతగా వైఎస్సార్ మిగిలిపోయారు. ఆయన ఈ భూమి నుంచి దూరమై ఇప్పటికి 13 ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన కీర్తి మాత్రం అజరామరంగా అలాగే ఉంది. ఆయనను సంక్షేమ సారధి అని అంతా అంటార్. వైఎస్సార్ హయాంలో అవినీతి జరిగింది అని విపక్షాలు అనడం మామూలే.

అయితే దాని మీద ఈ రోజు దాకా ఏ రుజువులూ లేవు. ఇక ఆయన జనం గుండెల్లో దేవుడిగా కొలువుండిపోయారు. అలాంటి వైఎస్సార్ విషయంలో ఆయన ముద్దుల తనయ, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట తప్పుగా దొర్లారు. ఆమె దాన్ని దిద్దుకునేలోపే లోకమంతా అది చుట్టేసింది.

తీరా తేరుకున్న షర్మిల తన పీయార్వో ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేయించినా కూడా వైఎస్సార్ మీద ఆమె చేసిన కామెంట్స్ అలాగే వైరల్ అవుతున్నాయి. ఇంతకీ షర్మిల ఏ మాట అన్నారు. అది ఎందుకు వైరల్ అయింది అంటే అది ఆసక్తికరమైన అంశమే. ఆమె లోటస్ పాండ్ లో ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణా సీఎం కేసీయార్ మీద చెలరేగిపోయారు.

ఆయన అన్ని ప్రాజెక్టులను మేఘా క్రిష్ణారెడ్డికే ఇచ్చారని, కమిషన్లు అన్నీ ఆయన దగ్గరే తీసుకుంటున్నారు అని విమర్శలు చేశారు. విపక్ష నేతగా ఆమె ఈ మాటలు అనడం సహజమే. అంతటితో ఆగని ఆమె గతించిన తన తండ్రి వైఎస్సార్ ని ముందుకు తెచ్చారు. తన తండ్రి ఏలుబడిలో ఒక్కరికే ప్ర్జాక్టులు అన్నీ కట్టకట్టి ఇవ్వలేదని, ఒక్కరి దగ్గరే కమిషన్లు తీసుకోలేదని అనేశారు. ఈ మాటలకు అర్ధం ఆమెకు ఆ సమయంలో తెలియకపోయినా అక్కడ ఉన్న మీడియా అయితే షాక్ తినేలాగే ఉన్నాయి మరి.

అంటే వైఎస్సార్ ఒక్కరి దగ్గర కమిషన్లు తీసుకోకుండా అందరికీ కాంట్రాక్టులు ఇచ్చి పలువురి దగ్గర కమిషన్లు తీసుకున్నారు అని అర్ధం వచ్చేలా ఆమె కామెంట్స్ చేశారు అన్న మ్యాటరే వైరల్ అవుతోంది. చిత్రమేంటి అంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాక అంతా వైరల్ అయ్యాక కానీ ఆమెకు తానేమి తప్పు మాట్లాడితో తెలిసిరాలేదు. దాంతో పీయార్వో ద్వారా ఖండన ఒకటి తెచ్చి మీడియాకు ఇచ్చారు. వైఎస్సార్ ఒక్కరి దగ్గర కాదు, ఏ ఒక్కరి దగ్గరా కూడా కమిషన్లు తీసుకోలేదని తమ తప్పుని దిద్దుకునే ప్రయత్నం చేశారు.

మొత్తానికి ఆవేశంలో దూకుడులో షర్మిల చేసిన ఈ కామెంట్స్ దివంగత నేత వైఎస్సార్ మీదకే దూసుకుని వెళ్ళాయి. ఆయన పేరుని తెలంగాణాలో ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడిని వాడుకుని తాను ఎదగాలని భావిస్తున్న షర్మిల మాటకు వస్తే తండ్రి ప్రస్థావన తెస్తున్నారు. అదే సమయంలో ఆమె తాను ఏమి అంటున్నది కూడా కాస్తా వివేచనతో ఆలోచించి నోటి వెంట వాటిని దొర్లిస్తే ఈ తప్పులు దొర్లే అవకాశం ఉండదని అంటున్నారు. ఈ ప్రెస్ మీట్ తరువాత అర్ధమైంది ఏంటి అంటే షర్మిల ఇంకా రాజకీయంగా రాటుదేలాలని. అలాగే తెలుగు భాషలో ఒక్క అక్షరం అటు ఇటూ అయినా అతి పెద్ద అర్ధాలు మారిపోతాయని గ్రహించాలని.