Begin typing your search above and press return to search.

మోడీ సర్కారును రూ.15వేల కోట్లు ఇవ్వాలన్న సీఎం జగన్

By:  Tupaki Desk   |   26 Aug 2020 12:30 PM IST
మోడీ సర్కారును రూ.15వేల కోట్లు ఇవ్వాలన్న సీఎం జగన్
X
మోడీ సర్కారుకు ఏపీ ముఖ్యమంత్రి తాజాగా లేఖ రాశారు. రూ.15వేల కోట్ల మొత్తాన్ని ఏపీకి సాయంగా ఇవ్వాలని కోరారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉందంటూ వివరాలు పంపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రూ.15వేల కోట్ల మేర అవసరం ఉంటుందన్న అంచనాను.. అందుకు సంబంధించిన లెక్కను పంపారు.

ఈ భారీ మొత్తాన్ని సేకరించేందుకు నాబార్డును ఆదేశించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపూర్తి అయితే లక్షలాది హెక్టార్లకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపూర్తి అయితే వేలాది హెక్టార్లు సాగులోకి వస్తాయని.. పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు.

తాము అడిగిన రూ.15వేల కోట్ల సాయానికి సంబంధించి లెక్కను కేంద్రానికి సీఎం జగన్ పంపారు. అంత భారీ మొత్తం ఎందుకుఅవసరమో అందులో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్.. కుడి.. ఎడమల కాలువలను నిర్మించటానికి రూ.5వేలకోట్లు చొప్పున అవసరమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు కట్టించాల్సిన పునరావాసాలు.. కాలనీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు మరో రూ.5వేల కోట్లు అవసరం ఉంటుందని వెల్లడించారు.

నిర్వాసితుల్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పునరావాస కాలనీలకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇంత వివరంగా లెక్కలుపంపిన తర్వాత కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మామూలుగా ఇవ్వాల్సిన మొత్తాల్నే ఇచ్చేందుకు ముప్పతిప్పలు పెట్టే మోడీ సర్కారు.. ఏపీ సీఎం కోరినట్లుగా ఇంత భారీ మొత్తాన్ని.. అందునా కరోనా టైంలో ఇచ్చేందుకు ఓకే చెబుతారా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.