Begin typing your search above and press return to search.

పీఎస్ ఆర్ ఏపీకి వచ్చేశారు... జగన్ కీలక పదవి ఇచ్చేసినట్టే

By:  Tupaki Desk   |   10 Jun 2019 6:58 PM IST
పీఎస్ ఆర్ ఏపీకి వచ్చేశారు... జగన్ కీలక పదవి ఇచ్చేసినట్టే
X
పీఎస్ ఆర్ అంటే పెద్దగా తెలియదేమో గానీ... పి. సీతారామాంజనేయులు అంటే మాత్రం తెలుగు ప్రజలకు ఓ నిబద్ధత కలిగిన పోలీసు అధికారి గుర్తుకు వస్తారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పీఎస్ ఆర్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సరిహిద్దు భద్రతా దళం (బీఎస్ ఎఫ్) ఐజీగా కొనసాగుతున్న ఆయన ఇప్పుడు మళ్లీ ఏపీ సర్వీసుల్లోకి వచ్చేశారు. ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిగాపోగా... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ బంపర్ విక్టరీ కొట్టేసింది. జగన్ నవ్యాంధ్రప్రదేశ్ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టేశారు. ఈ క్రమంలో అప్పటిదాకా ఏపీ అంటేనే అల్లంత దూరం పరుగెత్తిన చాలా మంది అధికారులు తిరిగి ఏపీ వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో తనను కూడా తన సొంత కేడర్ రాష్ట్రానికి పంపాలని పీఎస్ ఆర్ ఆంజనేయులు కేంద్ర హోం శాఖను కోరారు. ఈ రిక్వెస్ట్ కు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం, పీఎస్ ఆర్ కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కావడం, ఏపీకి రావడం, తాను రాష్ట్ర సర్వీసులకు వచ్చాను, ఏదైనా పోస్టు కేటాయించాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మాణ్యానికి రిపోర్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పీఎస్ ఆర్ కు కీలక పోస్టులు దక్కాయి. అయితే రాష్ట్ర విభజన, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పీఎస్ ఆర్ కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లిపోయారు. తాజాగా వైస్ తనయుడు జగన్ సీఎం కావడంతో తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. అయితే జగన్ సీఎం కాగానే పీఎస్ ఆర్ కు ఓ కీలక పోస్టును జగన్ రిజర్వ్ చేసిపెట్టినట్టుగా వార్తలు వినిపించాయి.

మొన్నటి ఐపీఎస్ అధికారుల బదిలీల్లో పీఎస్ ఆర్ పేరు తప్పనిసరిగటా ఉంటుందని అంతా ఆశించారు. అయితే జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఇక పీఎస్ ఆర్ ఇప్పుడు కూడా రాష్ట్ర సర్వీసులకు రారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన తనకు రిపోర్ట్ చేసినట్టుగా ఎల్వీ ప్రకటించడంతో ఎట్టకేలకు పీఎస్ ఆర్ దక్కే పోస్టు ఏదంటూ కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే జగన్ సీఎంగా కాగానే... పీఎస్ ఆర్ ను కీలకమైన రవాణా శాఖ కమిషనర్ గా నియమిస్తారని ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీఎస్ ఆర్ ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... వైఎస్ హయాంలో పీఎస్ ఆర్ తో పాటు కీలక పదవులను చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీఎస్ కౌముది కూడా ఇప్పుడు రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. మరి కౌముదికి జగన్ ఏ పోస్టు కేటాయిస్తారో చూడాలి.