Begin typing your search above and press return to search.

విశాఖ మరీ అంత దూరమా... ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:00 PM IST
విశాఖ మరీ అంత దూరమా... ?
X
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంత ఈజీగా కాలు బయటపెట్టరన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన రెండున్నరేళ్ళ ముఖ్యమంత్రిత్వంలో ఢిల్లీ వెళ్ళినపుడు మాత్రమే ఒకటి రెండు రోజులు నైట్ హాల్ట్ చేశారు. అంతే తప్ప జగన్ ఎపుడూ బయట జిల్లాలలో పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే జగన్ విశాఖకూ జగన్ కి మధ్య బాగా దూరం పెరిగిపోతోంది అంటున్నారు. జగన్ విశాఖకు గట్టిగా వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంటున్నారు. జగన్ విశాఖ రావాలంటే ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వారి ఇంట్లో పెళ్ళీ పేరంటం ఉండాలా అని విపక్షాలు వెటకారం చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది.

ఇదిలా ఉంటే విశాఖలో జగన్ కోసం పెండింగ్ లో పడిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాలి అంటే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన జగన్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అదే విధంగా విశాఖలో నిర్మించిన ఫ్లై ఓవర్ కూడా పూర్తి అయి జగన్ రాక కోసం వెయిట్ చేస్తోంది. ఇవే కాకుండా బీచ్ రోడ్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టాలి. ఇందులో టూరిజం కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి.

ఇంకో వైపు వీటికి మించి ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా ఉంది. అదేంటి అంటే బీచ్ రోడ్డులో రుషికొండ వద్ద టీటీడీ వారి ఆద్వర్యంలో నిర్మించిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం. అచ్చం తిరుపతిలో మాదిరిగా ఈ ఆలయాన్ని తీర్చి దిద్దారు. ఈ ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. దానిని కూడా జగన్ చేతుల మీదుగా జరిపించాలని నిర్ణయించారు. ఈ ఆలయం పూర్తి అయింది కానీ జగన్ రాక కోసమే అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక జగన్ని విశాఖ రమ్మంటూ అధికార అనధికార వర్గాలనుంచి ప్రతీ రోజూ ఆహ్వానాలు వస్తూనే ఉంటాయి. తాజాగా విశాఖ నేవీ అధికారులు కూడా జగన్ని కలసి డిసెంబర్ 4న విశాఖలో జరిగే నావీ దినోత్సవాన్ని తిలకించడానికి రావాలని కోరారు. ఇక ప్రతీ ఏటా సిటీలో విశాఖ ఉత్సవ్ ని ఘనంగా నిర్వహిస్తారు. దానికి చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన తప్పకుండా వచ్చేవారు. జగన్ సీఎం అయిన తొలి ఏడాది రాలేకపోయారు. రెండవ ఏడాది కరోనా వల్ల ఆ కార్యక్రమం ఆగింది. ఇపుడు అది తగ్గిన నేపధ్యంలో విశాఖ ఉత్సవాలను నిర్వహించాలని అనుకుంటున్నారు. మరి ఈసారి అయినా జగన్ వస్తారా అన్నది చూడాలి.

మొత్తానికి అధికార కార్యక్రమాలు ఎలా ఉన్న దేవదేవుడు ఏడుకొండల స్వామి వారిని జగన్ వెయిటింగ్ లో ఉంచడం మంచిది కాదని ఆధ్యాత్మిక పరులు అంతా కోరుతున్నారు. జగన్ కి కనుక తీరిక లేకపోతే వేరే వారి చేత అయినా విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయాన్ని ప్రారంభించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కోరుతున్నారు. మొత్తానికి జగన్ కోసం విశాఖ టోటల్ గా వెయింటింగ్ అన్న మాట.