Begin typing your search above and press return to search.

పోలవరం దశబ్దాల స్వప్నం.. నేనే నిర్మాణం పూర్తి చేస్తా : జగన్

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:45 AM IST
పోలవరం దశబ్దాల స్వప్నం.. నేనే నిర్మాణం పూర్తి చేస్తా : జగన్
X
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు. అది పూర్తయితే రాష్ట్రంలోని ఎన్నో వేల గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. లక్షలాది ఎకరాలు ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. ఎన్నో బృహత్తరమైన ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాగా బుధవారం అసెంబ్లీలో పోలవరం నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును తానే పూర్తిచేస్తానన్నారు. 2022 నాటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు కూడా అందిస్తామని పేర్కొన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి చేసినట్లు చెబుతోందని, కానీ వాస్తవంగా జరిగింది 20 శాతం పనులేనని విమర్శించారు. తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరిగాయని, ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10, 627 ఎకరాల(86శాతం) సేకరించడంతో పాటు కాలువ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు వివరించారు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రాజెక్టు కోసం కేవలం 1700 ఎకరాల భూమి మాత్రమే సేకరించారన్నారు. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం రాజశేఖర్ రెడ్డి హయాంలో 10, 342 (98శాతం ) భూమి సేకరిస్తే ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు మాత్రమే సేకరించ గలిగారన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెరిగినా అప్పటి బీజేపీ ప్రభుత్వం 16 వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పగా.. అందుకు అప్పటి సీఎం చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు తెలియడం లేదని విమర్శించారు. 2014 ఏప్రిల్ ముందు చేసిన ఖర్చు 7,800 కోట్లు తాము తిరిగి ఇవ్వమని, కేవలం నీటిపారుదల విభాగ వ్యయం రూ. 7, 500 కోట్లు మాత్రమే ఇస్తామని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా అందుకు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారని సీఎం జగన్ ప్రశ్నించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి రూ. 37, 883 కోట్లు అవసరమవుతాయని సీఎం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు గురించి కేంద్ర జల శక్తి మంత్రి ఆర్థిక మంత్రులను కలిశామని, 2013-14 ధరలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని వారికి వివరించినట్లు చెప్పారు. తమ చర్చలకు కేంద్ర ప్రభుత్వం సానుకూల స్పందన చూపించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గకుండా మొత్తం ఎత్తు 45.72 మీటర్ల మేరకు కడతామని మరోసారి సీఎం జగన్ ఉద్ఘాటించారు.