Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నినాదం!..జాబు రావాలంటే బాబు పోవాలి!

By:  Tupaki Desk   |   6 Nov 2017 7:57 AM GMT
జ‌గ‌న్ నినాదం!..జాబు రావాలంటే బాబు పోవాలి!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌ను నేటి ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపులపాయ‌లోని త‌న తండ్రి స‌మాధికి నివాళి అర్పించిన ఆయ‌న అక్క‌డి నుంచే పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌కు ముందుగా ఇడుపులపాయ‌లోనే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచి జ‌గ‌న్ చాలా ఆవేశంగా మాట్లాడారు. త‌న యాత్ర ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూనే... న‌వ్యాంధ్ర‌లో చంద్ర‌బాబు స‌ర్కారు సాగిస్తున్న పాల‌న‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అమ‌లు సాధ్యం కాని హామీల‌ను గుప్పించిన చంద్ర‌బాబు అధికారం చేజిక్కించుకున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాను మాత్రం అమ‌లు సాధ్యం కాని హామీల‌ను ఇచ్చేది లేద‌ని, ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌కుండా ఉండేది లేద‌ని కూడా జ‌గ‌న్ చాలా విస్ప‌ష్టంగానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసిన జ‌గ‌న్‌... అవే హామీలపై త‌న‌దైన శైలి పంచ్ డైలాగులు సంధిస్తూ ప్ర‌సంగించారు.

గ‌త ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించిన టీడీపీ... జాబు రావాలంటే - బాబు రావాల్సిందేన‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అదే మాట‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాల‌ను కూడా కోల్పోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రానికి ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కేటాయించ‌నున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింద‌ని, అయితే గ‌డ‌చిన నాలుగేళ్ల పాల‌నలో చంద్ర‌బాబు స‌ర్కారు ఒక్క ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ను కూడా తీసుకురాలేక‌పోయింద‌ని దుమ్మెత్తిపోశారు. కేంద్రం హామీ ఇచ్చిన‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు రాష్ట్రానికి వ‌చ్చి ఉంటే... రాష్ట్రంలోని నిరుద్యోగ యువ‌త‌కు వేలాది ఉద్యోగావ‌కాశాలు వ‌చ్చి ఉండేవ‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే కేంద్రం వ‌ద్ద రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టేసిన చంద్ర‌బాబు... రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల‌ను సాధించుకోవ‌డంపై దృష్టి సారించ‌డం లేద‌న్నారు. ఇదే త‌ర‌హా పాల‌న మ‌రింత కాలం పాటు సాగితే... రాష్ట్రం మ‌రింత సంక్షోభంలో ప‌డిపోవడం ఖాయ‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితి మారాలంటే... చంద్ర‌బాబు స‌ర్కారు గ‌ద్దె దిగాల్సిందేన‌ని జ‌గ‌న్ తెలిపారు. అంటే జాబు రావాలంటే... బాబు పోవాల్సిందేన‌ని జ‌గ‌న్ త‌న‌దైన పంచ్ డైలాగ్‌ ను సంధించారు.

రాష్ట్రంలో చంద్రబాబు ప్ర‌భుత్వం దుర్మార్గ‌పు పాల‌న‌ను సాగిస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ త‌న పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మందిని చంద్ర‌బాబు సంత‌లో గొర్రెలు కొన్న‌ట్లుగా కొనేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యంపై ఏమాత్రం గౌర‌వం ఉన్న ఏ ఒక్క‌రైనా ఇలాంటి పనులు చేయ‌ర‌ని కూడా జ‌గ‌న్ అన్నారు. ప్ర‌జాస్వామ్య విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌... ద‌మ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాల‌ని డిమాండ్ చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన చంద్ర‌బాబు స‌ర్కారు... అక్క‌డ రూ.200 కోట్లు ఖ‌ర్చు పెట్టి టీడీపీ అభ్య‌ర్థిని గెలిపించుకుంద‌న్నారు. నంద్యాల‌లో చేసిన‌ట్లుగా పార్టీ మారిన ఇత‌ర ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. ఆ 21 చోట్ల ఉప ఎన్నిక‌లు పెడితే... నంద్యాల మాదిరిగా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో రూ.200 కోట్ల చొప్పున రూ.4 వేల కోట్ల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తారో్ చూస్తామ‌ని కూడా జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. మొత్తంగా పాద‌యాత్ర తొలి స‌భ‌లోనే జ‌గ‌న్... చంద్ర‌బాబు స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డార‌నే చెప్పాలి.