Begin typing your search above and press return to search.

న్యూటన్ సిద్ధాంతం జగనన్న దగ్గర వర్కుట్ కాదా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 6:00 AM IST
న్యూటన్ సిద్ధాంతం జగనన్న దగ్గర వర్కుట్ కాదా?
X
'అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది. చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును'' - న్యూటన్ థర్డ్ లా. కొరుకుడుపడని భౌతికశాస్త్రాన్ని అచ్చ తెలుగులో అర్థమయ్యేలా చెప్పి చావమంటే.. ఏ ఒక్క మేధావి ఆ పని చేసే ప్రయత్నం చేయడు.

ఎక్కడిదాకానో ఎందుకు? న్యూటన్ మూడో సూత్రాన్ని చెప్పమని గూగులమ్మను అడిగితే.. అది చెప్పేది చదివితే.. ఉన్నది కాస్తా పోయేదిగా ఉంటుంది. న్యూటన్ మూడో సిద్ధాంతం గురించి తెలుగులో గూగుల్ చెప్పేది ఇదే.

దీన్నే అందరికి అర్థమయ్యేలా సింఫుల్ భాషలో.. చెంపకు చేయి పరమైనప్పుడు కంటికి నీరు ఆదేశమవును అని చెబితే ఎంత ప్రశాంతంగా.. మరెంత వివరంగా అర్థం కావటమే కాదు.. మనసులో ఇట్టే రిజిస్టర్ అయిపోతుంది.అలా అని ఇప్పుడు మేం చెప్పినట్లుగా రాస్తే.. పరీక్షలో సున్నా ఖాయం. నిజానికి మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల్లో ఇదొకటి.

అప్పుడెప్పుడో భూమి పుట్టిన వేళలో.. పుస్తకాలు రాసిన సందర్భంలో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాసిన రాళ్ల భాషనే.. ఇప్పటికి కొనసాగించాలని కోరటం కూడా తెలుగును చాలామంది ఆమోదించకపోవటానికి కారణంగా చెబుతారు.

అలా అని.. తెలుగును ఇంగ్లీషీకరించే దరిద్రం కూడా ఎక్కువే. సాంకేతికంగా చూసినప్పుడు గడిచిన ఇరవై ఏళ్లలో మన జీవితంలో మొబైల్ ఫోన్.. సెల్.. గుగూలమ్మతో పాటు.. సోషల్ మీడియా లాంటి చాలానే వచ్చాయి. వాటిని ఇంగ్లిషు పదాల్ని యధాతథంగా తీసుకొని.. వాడేయటం ద్వారా కొత్త పదాలను తయారు చేసుకోవటం మానేసి.. తెలుగును ఆంగ్లీకరించే పని అంతకంతకూ ఎక్కువ అవుతోంది. .ఇంతకీ న్యూటన్ థర్డ్ లా ప్రస్తావన ఎందుకొచ్చిందనేగా. అక్కడికే వస్తున్నాం.

న్యూటన్ చెప్పినట్లుగా చర్యకు ప్రతి చర్య తప్పనిసరిగ ఉంటుంది. ఇందుకు కొమ్ములు తిరిగి.. ప్రస్తుతం వంగిపోయిన చంద్రబాబు కానీ.. తనకు మించినోడు లేడని బీరాలు పలికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మాటకు వస్తే వీళ్లందరికి మించిన మహా గురువు ప్రధాని నరేంద్ర మోడీ కానీ న్యూటన్ సిద్ధాంతం అమలవుతుంది.

దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మినహాయింపుగా చెప్పాలి. ఎందుకిలా అంటే.. రాజకీయాలు పూలపాన్పు కంటే.. ముళ్ల కిరీటంగా అభివర్ణించేవారే ఎక్కువ. ఎందుకిలా అంటే.. అధికారం ఉంటే ఒకలా.. పవర్ లేకుండా మరోలాంటి పరిస్థితులు ఉంటాయి.

అధికారం చేతిలో ఉన్నప్పుడు అందరిని సంతోషపెట్టటం సాధ్యం కాదు. అలా అని కష్టపెట్టినా ఇబ్బంది. అన్నింటికి మించి అప్పటివరకు తమకున్న అధికారంలో సంతోషానికి గురి చేసి.. కారణాంతాల వల్ల ఆయనకు కలిగే సంతోషాన్ని కాస్తంత తగ్గించినా సరే.. అగ్గిలం మీద గుగ్గిలం మాదిరి చిందులు వేయటం.. రంకెలు వేసి.. నానా యాగీ చేయటం చూస్తుంటాం.

ఇది అన్ని ప్రభుత్వాధినేతలకు అనుభవమే. కానీ.. జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఇలాంటి పప్పులు అస్సలు ఉడకవని చెప్పాలి.

జగన్ మూడేళ్ల పాలనలో ఆయన అనుగ్రహాన్ని.. అభిమానాన్ని.. ప్రేమను టన్నుల కొద్దీ పొంది.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయినోళ్లు కనిపిస్తారు. సాధారణంగా ఇలాంటివే చంద్రబాబు చేస్తే.. ఆయనకు తలంటు పోసే కార్యక్రమం పెద్ద ఎత్తున ఎదురవుతుంది.

ఎందుకంటే.. ప్రేమను పొందిన వేళలో తన్మయత్వానికి గురి కావటం.. ఆగ్రహాన్ని చవి చూసినప్పుడు మాత్రం విపరీతమైన మండిపాటును ప్రదర్శించటం ద్వారా న్యూటన్ సిద్ధాంతంలో భాగంగా.. చర్యకు ప్రతి చర్యను గుర్తు చేస్తుంటారు. కానీ.. జగన్ నుంచి అభిమానం పొంది ఆ తర్వాతి కాలంలో ఆగ్రహాన్ని చవి చూసిన వారంతా మౌనంగా ఉంటారే తప్పించి.. నోరు తెరిచే ప్రయత్నం చేయరు.

ఎందుకిలా? అంటే అదే జగన్మోహన్ రెడ్డి మేజిక్ అని చెబుతారు. గౌతమ్ సవాంగ్ ఎపిసోడ్ చూస్తే.. ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేయటం ఒక ఎత్తు అయితే.. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయమని చెప్పటం.. ఆ తర్వాత ఆయన్ను నామినేటెడ్ పదవికి ఎంపిక చేయటం.. తీరా ఆ పదవిని చేపట్టాలంటే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినప్పటికీ.. ఆయన మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా.. ''ఎస్ బాస్'' అన్న రీతిలో ముందుకెళ్లిపోతున్న వైనం చూసినప్పుడు జగన్ మాష్టారి తంత్రం ఎలా ఉంటుందన్నది ఆలోచిస్తేనే వావ్ అనిపించేలా ఉంటుంది.

గతాన్ని వదిలేసినా.. వర్తమానంలో ప్రవీణ్ ప్రకాశ్ కావొచ్చు.. గౌతమ్ సవాంగ్ కావొచ్చు.. ఆకస్మిక బదిలీలకు గురైనప్పటికి మారు మాట్లాడకుండా.. చర్యకు ప్రతిచర్య అన్నది లేకుండా ఉన్న తీరు.. జగన్ కదిపే పావులు ఎంత నిక్కచ్చిగా.. స్వభావ సిద్ధమైన ప్రతిచర్య గుణాన్ని కోల్పోయేలా చేయటం నభూతో నభవిష్యతి అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.