ఫిరాయింపు...భలే ఇంపు...జగన్ మార్క్ ?

Tue Aug 16 2022 19:00:01 GMT+0530 (IST)

ys jagan on ycp MLAs

తమా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను గొర్రలతో వైసీపీ నేతలు పోల్చి ఘాటైన విమర్శలు చేశారు. వారిని సంతలో పశువుల్లా నాటి సీఎం చంద్రబాబు కొన్నారు అని కూడా దారుణమైన కామెంట్స్ వైసీపీ చేస్తూ వచ్చింది. మరి ఇపుడు అదే టీడీపీ నుంచి ఏకంగా నలుగురిని వైసీపీ లాగేసింది. జగన్ సమక్షంలోనే వీరంతా వైసీపీ కండువా కప్పుకున్నారు.అసెంబ్లీ రికార్డులలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఇక వీరిని తెచ్చి పార్టీని ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి నెత్తిన పార్టీ పెద్దలు కుంపటి పెట్టారు. అదే విధంగా వారి తగవులు కూడా తీర్చకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సర్దుకుపొమ్మని చెప్పుకొచ్చారు.

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ అయినా చీరాల నుంచి కరణం బలరాం అయినా గుంటూర్ వెస్ట్ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ కి కూడా సీటు కన్ఫర్మ్ చేస్తున్నారు.

ఇక విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి కూడా టికెట్ కన్ఫర్మ్ చేసారు. నేరుగా ఆయన సీఎం జగన్ ఆయన ఇంటికి వెళ్ళిన తరువాత వాసుపల్లికి ఇక అంతకంటే దక్కాల్సిన హామీ ఏముంటుంది. విశాఖ సౌత్ లో చూస్తే వైసీపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. వాసుపల్లి మీద 2014 నుంచి 2019 దాకా టీడీపీ టైమ్ లో పోరాడిన నేతలు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పట్టిన వారు ఉన్నారు.

వారందరినీ పక్కన పెట్టేసి వాసుపల్లికి జై అన్నట్లుగా వైసీపీ హై కమాండ్ వ్యవహరించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిన కోలా గురువులు ఇపుడు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అలాగే వాసుపల్లి మీద సౌత్ లో అయిదుగురు వైసీపీ కార్పోరేటర్లు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.

వారిలో కొందరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇంకో వైపు మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ కూడా టికెట్ కోసం చూస్తున్నారు. వీరందరికీ గట్టి ఝలక్ ఇస్తూ ఫిరాయింపే మాకు ఇంపు అని జగన్ నిరూపించారని అంటున్నారు. మరి జగన్ వాసుపల్లి ఇంటికి వెళ్లడం కాదు కానీ సౌత్ వైసీపీలో అతి పెద్ద ముసలం మొదలైంది అంటున్నారు.