Begin typing your search above and press return to search.

కలలో కూడా అనుకోలేదా జగన్... ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:00 PM IST
కలలో కూడా అనుకోలేదా జగన్... ?
X
కొన్ని అంతే. అనుకోనివే జరుగుతాయి. అనుకున్నవి అసలు జరగవు. ఇదే జీవితం. ఇలాగే కధ సాగుతుంది. రాజకీయాల్లో చూసుకున్నా ఇంతకు వేయింతలు ట్విస్టులు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే జగన్ తానుగా సృష్టించిన ఒకానొక వ్యవస్థ ఇపుడు జగన్ కే ఎదురునిలిచింది. నిరసన స్వరాలు వినిపిస్తోంది. సచివాలయాలు జగన్ సరికొత్త ప్రయోగాలు. ఆయన పాదయాత్ర వేళ పుట్టిన వినూత్నమైన ఆలోచనలు. ఒక విధంగా రాముడు జగన్ అయితే హనుమ లాంటి భక్తి ప్రపత్తులతో ఈ వ్యవస్థ ఉంటుందని, ఉండాలని తలచేవారే వైసీపీ నిండా ఉన్నారు.

తాను అధికారంలోకి రాగానే లక్షలాది మందికి సచివాలయాల పేరిట జగన్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతవరకూ మంచిదే. ఆయన నాడు చెప్పిన మాట ఏంటి అంటే కన్సాల్డేట్ పేమెంట్ తో రెండేళ్ళు పనిచేస్తే ఆ మీదట ప్రోబేషన్ ఇచ్చి సర్వీస్ ని రెగ్యులరైజ్ చేస్తామని. అలా కేవలం పదిహేను వేల నెల జీతానికి యువత ఈ కొలువులు చేపట్టారు. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ సచివాలయాలు ఆర్భాటంగా మొదలయ్యాయి.

నాటికి 15 వేల రూపాయలు అంటే ఫరవాలేదు అనుకోవాలి. కానీ గత రెండేళ్ళుగా కరోనా వచ్చి మొత్తం ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పారేసింది. ఈ దెబ్బకు అన్ని వ్యవస్థలు కుదేలు అయ్యాయి. ద్రవ్యోల్బనం కూడా అనేక రెట్లు పెరిగింది. దాంతో ఆ జీతం ఇపుడు వెట్టి చాకిరి కిందనే లెక్క. మరో వైపు పదిహేను వేల రూపాయలు జీతం ఏంటి, అరకొర బతుకులు ఏంటి అని సచివాలయ ఉద్యోగులు గత కొంతకాలంగా గుస్సా మీద ఉన్నారు.

పోనీ ఆడుతూ పాడుతూ చేసే జాబ్ కాదు, అన్ని సర్కారీ సేవలూ వారి మీదనే పెట్టి టోటల్ గా బాధ్యతలు అన్నీ అప్పగించేశారు. ఊపిరిసలపని పని, కరోనా లాంటి పాండమిక్ వస్తే ఇంటికి ఒంటికీ కూడా దూరమై పనిచేయాలి. మరి అలాంటి సచివాలయ ఉద్యోగుల విషయంలో జగన్ నిర్లక్ష్యమే చూపారు అంటున్నారు. ఆయన పీయార్సీని ప్రకటించిన సందర్భంగా మరో ఆరు నెలల దాకా ప్రొబేషన్ ఊసే లేదని చెప్పడంతోనే వారికి మండింది.

చాలు ఈ కొలువు అనుకుంటూ సచివాలయ ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు. సరిగ్గా ఇది థర్ట్ వేవ్ కరోనా ఉన్న సమయం. మరో వైపు జగన్ సృష్టించిన వ్యవస్థ‌ ఆయనకే ఎదురు తిరిగి ఆందోళన బాట చేపట్టడం అంటే జగన్ కలలో కూడా ఊహించి ఉండరనే అంటున్నారు. జగన్ కూడా మన వాళ్ళే కదా అని ఉదాశీనంగా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు రామాంజనేయ యుద్ధమే అంటున్నారు.

దాంతో వారితో చర్చించి సమస్య సానుకూలం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయినా ఆరు నెలలు అంటే వారు ఊరుకోరు. కచ్చితమైన హామీ అయితే ఇవ్వాలి. మరి ఆ దిశగా అడుగులు వేస్తేనే జగన్ క్రియేట్ చేసిన సచివాలయ వ్యవస్థ బాగుంటుంది. ఆయనకూ, వైసీపీకి రాజకీయంగా మేలు జరుగుతుంది. లేకపోతే జగన్ ఇమేజ్ మాత్రమే కాదు, వైసీపీకి కూడా భారీ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు.