తిట్టిన ఎమ్మెల్యే ఇంటికి జగన్....తమాషా మరిదే...?

Mon Aug 15 2022 21:00:01 GMT+0530 (IST)

ys jagan on mla

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని అంటారు. కానీ జగన్ పొలిటికల్ ఫిలాసఫీ వేరు అని చెబుతారు. ఆయన తనను విమర్శించే వారిని చేరదీయరు అని అంటారు. అయితే ఆయన కూడా కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లుగా ఉంది. దానికి తార్కాణమే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి జగన్ వెళ్లాలనుకోవడం. వాసుపల్లి టీడీపీ టికెట్ మీద 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన అంతకు ముందు కూడా అదే సీటు నుంచి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు.ఇక 2009లో కూడా టీడీపీ నుంచే పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడారు. ఆయనది రెండు దశాబ్దాలా రాజకీయ జీవితం అయితే ఆయన రాజకీయ పుట్టుక ఎదుగుదల అంతా టీడీపీలోనే సాగింది. ఆయన అనేక సార్లు టీడీపీ విశాఖ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇక జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు వాసుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కం సిటీ ప్రెసిడెంట్.

నాడు జగన్ విశాఖలో భూముల దందా మీద నగరం నడిబొడ్డున ఆందోళన నిర్వహిస్తే జగన్ వచ్చి వెళ్ళారని ఆ ప్రదేశం అపవిత్రం అయిందని చెప్పి పసుపు నీళ్ళతో మొత్తం క్లీన్ చేయించారు వాసుపల్లి. ఇక జగన్ మీద పరుష పదజాలంతో ఆయన గతంలో టీడీపీలో ఉన్నపుడు హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి వాసుపల్లి 2020లో వైసీపీ నీడకు చేరారు.

అయితే ఆయన ఈ రోజుకీ టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే ఆయన జగన్ కి బాగా నచ్చేశారు. అందుకే ఆయననే విశాఖ సౌత్ వైసీపీ ఇంచార్జిగా నియమించారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆయనకే ఇచ్చేందుకు హామీ లభించింది. ఇక వాసుపల్లి కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. అయితే దానికి జగన్ని ఆహ్వానించినా ఆయనకు తీరుబాటు లేక హాజరుకాలేకపోయారు.

దాంతో ఇపుడు జగన్ విశాఖ టూర్ ఈ నెల 6న ఉన్న  సందర్భంగా వాసుపల్లి ఇంటికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఇక చాలాకాలం పాటు వాసుపల్లి టీడీపీలో ఉన్నా ఏనాడు చంద్రబాబు ఆయన ఇంటికి రాలేదు. కానీ కేవలం రెండేళ్ల అనుబంధంతోనే జగన్ వాసుపల్లి ఇంటికి వస్తున్నారు అంటే ఈ రాజకీయ బంధం బహు గట్టిదేనా అనుకొవాల్సి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇలాంటి తమాషాలు చాలానే జరుగుతూ ఉంటాయి మరి.