Begin typing your search above and press return to search.

జగన్‌ ఇలాకాలో బాబుకు ఘనస్వాగతం దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   21 May 2022 5:06 AM GMT
జగన్‌ ఇలాకాలో బాబుకు ఘనస్వాగతం దేనికి సంకేతం?
X
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరిగి మూడేళ్లు అయ్యింది. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. అయితే మూడేళ్లకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వం తాము అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతలు పవన్‌ కల్యాణ్, చంద్రబాబు పర్యటనలకొస్తున్న విశేష స్పందనే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి కోర్‌ బెల్ట్‌ వంటి రాయలసీమలో ప్రస్తుతం చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న అసంతృప్తికి చిహ్నమని పేర్కొంటున్నారు. చివరకు ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడపలోనూ చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ ఇదే ఆదరణ, స్వాగతం ప్రజల నుంచి లభించాయని గుర్తు చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు పదునైన విమర్శలు చేస్తున్నారు. జగన్‌ ఒక ఉన్మాది అని, సైకో అని నిప్పులు చెరుగుతున్నారు. విధ్వంసమే లక్ష్యంగా జగన్‌ పాలిస్తున్నారని.. ఆయనకు పాలన చేతకాదని చెబుతున్నప్పుడు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండటం జగన్‌ ప్రభుత్వంపై గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శన మని అంటున్నారు.. మూడు రాజధానులని చెప్పి ఇప్పటివరకు ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదని.. కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు తీసుకురాలేకపోయారని.. ఇలాంటి జగన్‌ మూడు రాజధానులను ఎలా నిర్మించగలరని చంద్రబాబు వేసిన ప్రశ్న ప్రజలను ఆలోచనలో పడేస్తోందని చెబుతున్నారు. జగన్‌కు ఏదీ చేతకాదని.. మళ్లీ టీడీపీ అడ్డుకుంటుందని తమపై నిందలు మోపుతారని ప్రజలకు బాబు వివరిస్తున్నారు. అలాగే జగన్‌ ప్రభుత్వం అప్పులు 8 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రెండేళ్లలో మరో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారని చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయలకు చేరబోతున్నాయని తెలిపారు. ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రజల నెత్తినే పడతాయని చంద్రబాబు వివరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే శ్రీలంకలా మారబోతోందని పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చంద్రబాబు చెబుతున్న ప్రజలను ఆలోచనలో పడేస్తోందని అంటున్నారు.

జగన్‌ ప్రభుత్వం ప్రధాన సమస్యలను వదిలేసి కేవలం డబ్బులు పంచడమే అభివృద్ధిలా భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు ఏపీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు రాజధానుల సంగతి దేవుడెరుగు.. ఒక్క రాజధానికీ అతీగతీ లేదని గుర్తు చేస్తున్నారు. ఇక పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుని నిధులను దోచేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఊరూవాడా ఎలుగెత్తి చాటారని నాటి పరిణామాలను వివరిస్తున్నారు. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి మూడేళ్లు అయ్యింది. ఇంతవరకు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన రెండు డెడ్‌లైన్లు కూడా అయిపోయాయని పేర్కొంటున్నారు. ఇంతకు ముందు జల వన రుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీ సాక్షిగా మీసాలు తిప్పి మరీ నవంబర్‌ 2021కే పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారని.. ఆ తర్వాత 2022 మార్చి అన్నారని.. ఇప్పుడు అది కూడా పూర్తయిపోయిందని వివరిస్తున్నారు. ఈలోపు అనిల్‌ కుమార్‌ మంత్రిపదవే ఊడిపోయింది. ఇప్పుడు నాకేం సంబంధం.. నేను మంత్రిని కాదుగా అని ఆయన తప్పించుకోవడం అన్యాయమని పేర్కొంటున్నారు. ఇక కొత్త జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని.. ఆయనకు ఆ శాఖపై ఎలాంటి జ్ఞానం, పట్టు లేవని చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పోయిందని.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తాజాగా అంబటి రాంబాబు సెలవిస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు.

ఇక 20 మంది ఎంపీలను గెలిపించండి.. ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్‌ ఊదరగొట్టారని.. కానీ ఇప్పటివరకు మళ్లీ ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనకున్న ఎంపీల బలంతో వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ తనపై ఉన్న అవినీతి కేసుల మాఫీకి వాడుకుంటున్నారని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ప్రధానమైన రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఇక ఈ మూడేళ్లలో జగన్‌ ప్రభుత్వం మద్యం ధరలు, విద్యుత్‌ చార్జీలు ధరలు, ఆర్టీసీ సెస్, చెత్త పన్ను, ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ అంటూ 10 వేల రూపాయల బాదుడు ఇలా వరుస పెట్టి ప్రజలను పన్నుల రూపంలో బాదేస్తోందని చెబుతున్నారు. అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతోందని పేర్కొంటున్నారు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఏహ్య భావాన్ని పెంచుతున్నాయని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి ప్రగతిపథంలో నడవాలంటే టీడీపీ–జనసేన కూటమి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్‌ పర్యటనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివరిస్తున్నారు.