Begin typing your search above and press return to search.

బాబు చెయ్య‌నిది జ‌గ‌న్ చేసి చూపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   10 Aug 2016 8:56 AM GMT
బాబు చెయ్య‌నిది జ‌గ‌న్ చేసి చూపిస్తున్నాడు
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నం కొన‌సాగుతోంది. అయితే బాబు ప్ర‌య‌త్నం త‌న ప‌రిస్థితులు, ప్రాధామ్యాల‌కు త‌గిన‌ట్లుగా ముందుకు పోతున్నార‌నే టాక్ న‌డుస్తోంది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లో కానీ, కేంద్రంతో చ‌ర్చించే స‌మ‌యంలో కానీ సీఎం హోదాలో బాబు ఒక్క‌రే త‌న ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం ఇందుకు కార‌ణం. మిగ‌తా పార్టీల‌కు నామ‌మాత్రంగా అయినా భాగ‌స్వామ్యం క‌ల్పించ‌క‌పోవ‌డంతో హోదా కోసం రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన‌ ప్ర‌య‌త్నం అంతా సోలో షోగా మారిపోతోంద‌నే విమ‌ర్శ విప‌క్షాల నుంచి ఉంది. ఇదే ప‌రిస్థితిని ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నార‌నే టాక్ న‌డుస్తోంది.

చంద్రబాబు విస్మ‌రించిన పాయింట్ ఆధారంగా జ‌గ‌న్ ముందుకువెళుతున్నాడ‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఢిల్లీ వెళ్లిన వైఎస్ జ‌గ‌న్ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌లిశారు. అంత‌టితోనే త‌న ప‌ర్య‌ట‌నను స‌రిపెట్ట‌కుండా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో స‌మావేశమ‌య్యారు. సీపీఐ జాతీయ నేత డీ రాజాతో చ‌ర్చించారు. త‌ద్వారా దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌, త‌ర్వాత కీల‌క‌మైన రెండు పార్టీలైన సీపీఐ, సీపీఎంల‌తో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. సీతారాం ఏచూరి, డీ రాజా కూడా ఇదే విష‌యం చెప్ప‌డం ఆస‌క్తిక‌రం.

ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ బేబీల‌ను వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన పార్టీ ఎంపీల‌తో కలసి సమావేశమయ్యారు. అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెబుతున్న కేంద్రం తీరును తప్పుపట్టారు. ఏపీకి హోదా ఇవ్వాలా వద్దా? ఒక వేళ ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? అనే చర్చ ఇప్పుడు అనవసరమన్నారు. విభజన సమయంలోనే ఏపీకి హోదా ఇస్తామని పార్లమెంట్‌ హామీ ఇచ్చిందన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పగా.... ప్ర‌తిపక్ష సభ్యుడు వెంకయ్య నాయుడు లేచి తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని సభలోనే ప్రకటించిన విషయాన్ని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా అప్పుడు సభలోనే ఉన్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయారని ఏచూరి మండిపడ్డారు. పోరాటాలతోనే హోదా దక్కుతుందని, అందుకు సీపీఎం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించేందుకు కలసికట్టుగా పోరాటం చేస్తామని, హోదా వచ్చేంత వరకు వెనుతిరిగేది లేదని స్ప‌ష్టం చేశారు. సీపీఐ జాతీయ నేత డి.రాజా త‌న‌ను వైఎస్ జ‌గ‌న్ క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదాపై జాప్యం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని పేర్కొంటూ ఆ హక్కును సాధించేకునే క్రమంలో జరుగుతున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.

సీపీఐ, సీపీఎం ముఖ్య‌నేత‌ల‌ను క‌లిసిన అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఏపీలో పోరాటం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్‌ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంతో ఏపికి ప్రత్యేక హోదా అవసరం మరింత పెరిగిందన్నారు.