Begin typing your search above and press return to search.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   23 Sept 2020 11:02 PM IST
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
X
పంచెకట్టు.. తిరునామాలు.. వెంట మంగళవాయిద్యాలు.. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా ఏపీ సీఎం జగన్ శ్రీవారికి ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం జగన్ కు ఆశీర్వచనాలు అందించారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలంటే చూడడానికి భక్తకోటికి రెండు కళ్లు చాలవు. అలాంటి అద్భుతమైన ఘట్టంలో పాలుపంచుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ వాహన సేవలో సైతం వీరంతా పాలుపంచుకున్నారు.

అనంతరం సీఎం జగన్ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శన భాగ్యం అనంతరం సీఎం జగన్ పద్మావతి అతిథి గృహానికి చేరుకొని ఈ రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్ ను, డైరీని సీఎం జగన్ ఆవిష్కరించారు.

గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు సీఎంలు పారాయణంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాలకు ఇద్దరు సీఎంలు శంకుస్తాపన చేస్తారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం జగన్ 9.20 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి ఉదయం 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం ద్వారా గన్నవరంకు చేరుకుంటారు.