Begin typing your search above and press return to search.

జగన్ నోట వైఎస్ మాట

By:  Tupaki Desk   |   9 Dec 2016 9:43 AM GMT
జగన్ నోట వైఎస్ మాట
X
దివంగత వైఎస్ ఎక్కడ ఏ సభలో మాట్లాడినా కూడా కచ్చితంగా ఒక మాట చెప్పేవారు.. పేదలకు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా, ఆరోగ్య సమస్య తలెత్తినా, ప్రమాదాలు జరిగినా వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేయాలని చెప్పేవారు.. 108 గురించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకుని దాన్ని అత్యవసర సమయాల్లో వినియోగించావాలన్న ఉద్దేశంతో జనాన్ని ఆకట్టుకునేలా ఆ సంగతి చెప్పేవారు. ‘‘మీకు ఏ కష్టమొచ్చినా 108కి ఫోన్ చేయండి.. కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్సు వస్తుంది’’ అని చెప్పేవారు. ఆ మాట ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ చేరి కోట్లాది మంది నిత్యం దాన్ని వినియోగించుకునేవారు. రాజశేఖరరెడ్డి దెబ్బకు కుయ్ కుయ్ అనేది బాగా పాపులర్ అయింది. అయితే... ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 108 సేవలు దాదాపుగా మృగ్యమయ్యాయి. దీంతో రాష్ర్టంలో ఆ కుయ్ కుయ్ లు వినినిపించడం లేదు. కానీ ఆరోగ్య శ్రీ , 108 సేవలను ప్రభుత్వం విస్మరిస్తుండడంపై జగన్ ప్రశ్నిస్తూ ఈ రోజు ఒంగోలులో నిర్వహిస్తున్న సభలో మళ్లీ ఆ కుయ్ కుయ్ లు వినిపించారు.

పేదలను తెలుగుదేశం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. 108 నెంబర్ కు ఫోన్ చేస్తే...కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ వచ్చేదని...అనారోగ్యంతో ఉన్నవారిని తీసుకెళ్లి, వారికి ఉచిత వైద్యం చేసి, ఛార్జీలకు డబ్బులిచ్చి, మందులిచ్చి ఇంటికి పంపేవారని అన్నారు. ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడొస్తుందో తెలియదని అన్నారు.

పేదలు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే ఎలుకలు దాడులు చేస్తాయని, లేదా వైద్యులే ఉండరని విమర్శించారు. లేదంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఒళ్లు, ఇళ్లు గుల్ల చేసుకొమ్మంటారని ఆయన ఆరోపించారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా నీరుగార్చారని ఆయన విమర్శించారు.