Begin typing your search above and press return to search.

కేకలేయాల్సిన చోట లేఖలతోనా... ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:19 PM IST
కేకలేయాల్సిన చోట లేఖలతోనా... ?
X
కేంద్రం తీరు మీద శివతాండవమే చేశారు పొరుగు రాష్ట్రం సీఎం కేసీయార్. ఏకంగా కొత్త రాజ్యాంగం అవసరం అన్నంతదాకా వెళ్ళిపోయారు. ఇక పక్కనున్న తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ ని తో లాభమే లేదని తేల్చేశారు ఇక బీజేపీని దించేయల్సిందే అంటూ విపక్షాలకు లేఖలు సందిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా అంతా ఫైర్ అవుతూంటే ఏపీ సీఎం జగన్ మాత్రం లేఖలనే నమ్ముకున్నారు.

ఏపీకి బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగితే జగన్ మోడీకి లేఖ రాయడం ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీ పరిస్థితిని చూడాలని, విభజన తరువత ఎంతగా నష్టపోయిందో ఆలోచించాలని జగన్ అంటున్నారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా జగన్ ఆ లేఖలో పేర్కోనడం విశేషం.

ఏపీకి రెవిన్యూ లోటు సహా ఇతర అంశాల్లో ఈ రోజుకీ న్యాయం జరగలేదు అని కూడా ఆయన అన్నారు. అనేక అంశాలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది అని కూడా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రన్ని ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా సహకరించాలన్ జగన్ కోరుతున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ ఇంతవరకూ ఏపీ నుంచి జగన్ సీఎం గా ఇలాంటి లేఖలు ఎన్ని రాయ‌లేదు, అంతేనా ఢిల్లీకి ఎన్నో సార్లు వెళ్ళి ప్రధానికి వినతి చేయలేదు. అయినా కేంద్ర పెద్దలు ఏపీకి ఏమైనా సాయం చేశారా. ఇక రీసెంట్ గా జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధానికి అన్నీ వివరించి వచ్చారు. కానీ బడ్జెట్ చూస్తే షరా మామూలుగానే ఉంది. మరి ఇపుడు మీడియా ముందుకు వచ్చి గట్టిగా జగన్ కేంద్రాన్ని నిలదీస్తారు అనుకుంటే ఆయన ఒక లేఖ రాసేశారు. అంటే కేంద్ర బడ్జెట్ మీద జగన్ మర్క్ రియాక్షన్ ఇంతటితో సరి అనుకోవాలేమో.