Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర హామీ మ‌రొక‌టి తీర్చేసిన జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   1 Jun 2019 10:46 AM IST
పాద‌యాత్ర హామీ మ‌రొక‌టి తీర్చేసిన జ‌గ‌న్‌!
X
పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వ‌రుస పెట్టి స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. ఏ పాయింట్ మీద చ‌ర్చ జ‌ర‌పాలో ఆ అంశం మీద‌నే ఎక్కువ ఫోక‌స్ పెట్ట‌టం.. వెనువెంట‌నే నిర్ణ‌యాలు తీసుకోవ‌టం చేస్తున్నారు. తాజాగా అలాంటి ప‌నే మ‌రొక‌టి చేశారు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌క్క‌న రోజున‌.. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హించిన జ‌గ‌న్‌.. పాద‌యాత్ర సంద‌ర్భంగా తానిచ్చిన హామీని తీర్చేశారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంలో ప‌ని చేసే కార్మికుల‌కు ఇచ్చే గౌర‌వ వేత‌నాన్ని రూ.1000 నుంచి రూ.3వేల వ‌ర‌కూ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అన్నింటికి మించి మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం ఏమంటే.. ఇక‌పై ఈ కార్మికులు వంట చేసే బాధ్య‌త నిర్వ‌ర్తించ‌రు. వారు కేవ‌లం ఆహారాన్ని పిల్ల‌ల‌కు వ‌డ్డించే కార్య‌క్ర‌మానికి ప‌రిమితం కానున్నారు. పిల్ల‌ల‌కు అందించే మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని రుచిక‌రంగా త‌యారు చేయాల‌ని.. అందుకు త‌గ్గ‌ట్లుగా వంట‌శాల‌లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఇందులో భాగంగా అక్ష‌య‌పాత్ర స‌భ్యుల‌తోనూ.. పాఠ‌శాల విద్యాశాఖ అధికారుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ప్ర‌తినిధుల‌కు త‌న ఎజెండా స్ప‌ష్టం చేశారు.

పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నం అందించ‌టం.. ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో ఆహారాన్ని త‌యారు చేయించ‌టం.. స‌మ‌యానికి వారికి ఆహారం అందేలా చూడ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లు సెంట్ర‌ల్ కిచెన్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఇక‌పై విద్యార్థుల‌కు అందించే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి వైఎస్సార్ అక్ష‌య పాత్ర‌గా పిల‌వ‌నున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగును క‌చ్ఛితంగా బోధించాల‌ని.. ఇంగ్లిషు కూడా త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌టంతో పాటు.. ప్రైవేటు స్కూళ్ల‌తో పోటీ ప‌డేలా నివేదిక సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. ఈ అంశంపై మ‌రోసారి భేటీ కావాల‌ని.. అప్ప‌టిలోపు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విష‌యంలో ఏం చేయాలన్న దానిపై నివేదిక సిద్ధం చేయాల‌న్నారు.

రాష్ట్రంలోని ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనూ మరుగుదొడ్లు, శుభ్రమైన తాగునీరు, విద్యార్థులు కూర్చోవడానికి ఫర్నీచర్, తరగతి గదుల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలతో పాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్‌ ఆదేశించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ఫొటోలు తీయించి, ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ దూసుకెళుతున్న జ‌గ‌న్ తీరు అధికార వ‌ర్గాల్లో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.