Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు జ‌గ‌న్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశార‌బ్బా

By:  Tupaki Desk   |   17 Jun 2019 4:50 PM IST
కేసీఆర్‌ కు జ‌గ‌న్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశార‌బ్బా
X
టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు నిజంగానే రిట‌ర్న్ గిఫ్ట్ ద‌క్కింద‌నే చెప్పాలి. అదేదో... తాను టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని కేసీఆర్ చేప్పిన రిట‌ర్న్ గిఫ్ట్ కాదు. వైసీపీ అధినేత‌, న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తాను ఏ రీతిన గ్రాండ్ వెల్ క‌మ్ పలికారో, అదే త‌ర‌హాలో, ఇంకా చెప్పాలంటే అంత‌కుమించిన స్థాయిలో జ‌గ‌న్ నుంచి కేసీఆర్ కు గ్రాండ్ వెల్ క‌మ్ ద‌క్కింది. తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావాల‌ని జ‌గ‌న్ ను ఆహ్వానించేందుకు కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్‌, ఇత‌ర పార్టీ నేత‌ల‌తో క‌లిసి నేటి మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. తొలుత బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కేసీఆర్ బృందం ఆ త‌ర్వాత నేరుగా అమ‌రావతి ప‌రిధిలోని తాడేప‌ల్లిలో ఉన్న జ‌గ‌న్ నివాసానికి వెళ్లింది.

ఈ సంద‌ర్భంగా త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌... కారులో నుంచి దిగిన కేసీఆర్ కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పుష్ప‌గుచ్చాలు ఇచ్చి కేసీఆర్ కు గ్రాండ్ వెల్ క‌మ్ ప‌లికారు. కేసీఆర్ తో పాటు ఆయ‌న వెంట వ‌చ్చిన ఇత‌ర నేత‌ల‌కు కూడా జ‌గ‌న్ పుష్ప‌గుచ్చాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత కేసీఆర్ బృందాన్ని సాద‌రంగా త‌న గృహంలోకి ఆహ్వానించిన జ‌గ‌న్‌... వారంద‌రికి అదిరేటి డిన్న‌ర్ ఇచ్చారు. మొత్తంగా స‌తీమ‌ణితో వెళ్లిన త‌న‌కు కేసీఆర్ ఎంత ఘ‌నంగా ఆహ్వానం ప‌లికారో, అంత‌కు మించి జ‌గ‌న్‌... కేసీఆర్ కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. అంటే... కేసీఆర్ కు రిట‌ర్న్ గిఫ్ట్ ద‌క్కిన‌ట్టే కదా. ఇదిలా ఉంటే... ఈ వెల్ క‌మ్ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ కు కేసీఆర్ ఓ శాలువా క‌ప్పారు. త‌మ‌కు కాస్తంత దూరంగా ఉన్న త‌న కుమారుడు కేటీఆర్ ను పిలిచి మ‌రీ జ‌గ‌న్ కు ప‌రిచ‌యం చేశారు.