Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డుపై స్పందించిన జగన్ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   19 Jun 2019 2:15 PM IST
టీటీడీ బోర్డుపై స్పందించిన జగన్ ప్రభుత్వం!
X
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాకా వివాదంగా మారిన వ్యవహారాల్లో టీటీడీ బోర్డు వ్యవహారం ఒకటి. సాధారణంగా ప్రభుత్వాలు మారగానే టీటీడీ చైర్మన్లు పద్ధతిగా రాజీనామాలు చేసి వెళ్లి పోతూ ఉంటారు. టీటీడీ బోర్డులను ఏపీ ప్రభుత్వమే నియమిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం మారగానే నైతిక విలువలకు కట్టుబడి చాలా మంది బోర్డు నుంచి వైదొలుగుతూ ఉంటారు.

ఈ సారి కూడా కొందరు బోర్డు సభ్యులు రాజీనామా చేసి తప్పుకున్నారు. రాఘవేంద్రరావు వంటి వాళ్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా బోర్డులో చోటు సంపాదించగా, చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు దించేయగానే రాఘవేంద్రరావు తో సహా కొందరు రాజీనామాలు చేశారు. అయితే బోర్డు చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చేసేది లేదంటూ భీష్మించుకున్నారు.

బోర్డును రద్దు చేసుకోండి కానీ, తను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆయన అంటున్నారు. అలా అనడం సంగతి పక్కన పెడితే, బోర్డు చైర్మన్ హోదాలో ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు, బోర్డు పరిధిలోని నియామకాలకు సంబంధించిన పోస్టులను అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ బోర్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.

అతి త్వరలోనే టీటీడీ బోర్డును రద్దు చేయబోతున్నట్టుగా ప్రకటించారు ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోర్డు రద్దుకు ఆర్డినెన్స్ ను తీసుకురాబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అలాగే ఆలయాల్లో అర్చకత్వం విషయంలో వంశ పారంపర్యత వివాదాలను కూడా పరిష్కరించబోతున్నట్టుగా ఆయన తెలిపారు.