Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మించిన ర్యాంకు జగన్ కు

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:44 AM IST
కేసీఆర్ కు మించిన ర్యాంకు జగన్ కు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ ను వేయటమే కాదు.. డిఫరెంట్ సీఎంగా ఇమేజ్ తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రమాణస్వీకారోత్సవానికి ముందే తన నిర్ణయాలతో అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న ఆయన.. సీఎం పదవిని చేపట్టిన అనతి కాలంలోనే అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. దేశ్ కా మూడ్ పేరుతో వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డికి టాప్ త్రీలో నిలిపారు.

తాజాగా నిర్వహించిన సర్వేలో దేశంలోని 14 రాష్ట్రాల్ని ర్యాంకు పోటీకి ఉంచారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ప్రజల్లో ఉన్న పరపతి.. వారు ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ర్యాంకుల్ని నిర్ణయిస్తారు. ఈ ర్యాంకుల్లో 81 పాయింట్లతో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో నిలిచారు. 72 పాయింట్లతో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలవగా.. 71 పాయింట్లతో జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో మనోహర్ లాల్ ఖట్టర్.. ఐదో స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారు. ఈ సర్వేలో గులాబీ బాస్ కు 65 పాయింట్లు లభించాయి.

ఈ సర్వేలో మొత్తం11,252 మంది పాల్గొనగా.. అందులో ఓటుహక్కు ఉన్న వారు 10,098 మంది. ఆగస్టు 9 నుంచి పద్నాలుగు వరకూ నిర్వహించిన ఈ సర్వే ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పోటీలో ఉన్న మిగిలిన ముఖ్యమంత్రులతో పోల్చినప్పుడు.. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల వ్యవధిలోనే మూడో స్థానాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ఈ ముఖ్యమంత్రుల్లో అత్యంత పిన్న వయస్కుడు జగన్మోహన్ రెడ్డి కావటం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాల్ని అమలు చేయటంతో పాటు.. పాలన విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు సానుకూలంగా రియాక్ట్ అవుతున్న వైనం తాజా సర్వే చెప్పేస్తుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే మెరుగైన స్థానంలో జగన్ నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

ర్యాంకు ముఖ్యమంత్రి పేరు వచ్చిన పాయింట్లు
1. నవీన్ పట్నాయక్ 81
2. యోగి ఆదిత్యనాథ్ 72
3. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 71
4. మనోహర్ లాల్ ఖట్టర్ 68
5. కె. చంద్రశేఖర్ రావు 65
6. అమరిందర్ సింగ్ 62
7. అరవింద్ కేజ్రీవాల్ 60
8. విజయ రూపాని 59
9. రఘుబర్ దాస్ 57
10. కమల్ నాథ్ 54
11. మమతాబెనర్జీ 54
12. నితీశ్ కుమార్ 52
13. అశోక్ గెహ్లాట్ 50
14. పళనిస్వామి 44