Begin typing your search above and press return to search.

జగన్ ముందడుగు.. అసలు కథ ఇప్పుడే..

By:  Tupaki Desk   |   10 Jan 2019 11:34 AM IST
జగన్ ముందడుగు.. అసలు కథ ఇప్పుడే..
X
13 జిల్లాలు.. 3648 కిలోమీటర్ల పాదయాత్ర.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు టీడీపీ నేతలు, పచ్చ మీడియా సాధ్యకాదంటూ ఎద్దేవాలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన జగన్ పాదయాత్ర ఎలా చేస్తాడంటూ దెప్పి పొడిచింది. కానీ అలుపెరగని సంకల్పం.. ప్రజా ఆశీర్వాదంతో జగన్ ఈ దిగ్విజయ యాత్రను అంతే దిగ్విజయంగా పూర్తి చేశారు. జనంతో కలిసి.. జనంలో ఉండి మూడేళ్లుగా వారి ఆదరాభిమానాలు చూరగోన్నారు.

జగన్ వెంట జనం లేరని.. వైసీపీ ఏర్పాటు చేసిన మనుషులని టీడీపీ, పచ్చమీడియా ఎంత మొత్తుకున్నా జగన్ సభలకు హాజరైన జనమే వారికి కళ్లు బైర్లు కమ్మేలా చేశారు. ఇలా అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ జగన్ పాదయాత్ర విజయవంతమైంది.

మామూలుగా ఒక పెద్ద పని పూర్తయినప్పుడు కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని వ్యూహరచన చేయడం రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. కానీ జగన్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇచ్చాపురంలో సభ ముగియగానే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుపతి బయలు దేరారు. అక్కడ స్వామి వారి ఆశీర్వాదాల అనంతరం ఇడుపులపాయ వెళతారు. ఇప్పుడు మరింత ఉత్సాహంగా అగ్రెసివ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని విరామం లేకుండా పనిచేయాలని జగన్ నిర్ణయించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.

సంక్రాంతి సంబరాల్లోనే వైసీపీలో కీలక నిర్ణయాల దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. సంక్రాంతికి పార్టీలో జోష్ నింపేలా జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఇక అమరావతిలో జగన్ తన సొంత ఇంటి నిర్మాణంతోపాటు పార్టీ కార్యాలయ నిర్మాణాలను పూర్తి చేసి అక్కడికే షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించారు. ఇక నుంచి వైసీపీ కార్యక్రమాలన్నీ అమరావతి నుంచే జరుగుతాయట..

ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పుడే అభ్యర్థుల ఎంపిక, గ్రామ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం.. ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేయడం.. సహా చాలా పనులే వైఎస్ జగన్ చేపడుతున్నారు. ఎన్నికల కార్యక్షేత్రంలోకి జనవరి నెల నుంచే దూకేందుకు జగన్ సిద్ధమయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రజాసంకల్ప యాత్రతో ప్రజలకు చేరువైన జగన్.. ఇప్పుడు మరో పెద్ద ముందడుగు వేయబోతున్నట్టు వైసీపీ నుంచి వార్తలొస్తున్నాయి.