Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దే గెలుప‌న్న స‌ర్వే వారికి క‌నిపించ‌దా?

By:  Tupaki Desk   |   8 Oct 2018 7:37 AM GMT
జ‌గ‌న్ దే గెలుప‌న్న స‌ర్వే వారికి క‌నిపించ‌దా?
X
మీడియా ప‌నేమిటి? జ‌రిగిన విష‌యాల్ని చెప్ప‌టం. ఏదైనా ఒక సంస్థ స‌ర్వే చేసి ఫ‌లితాలు వెల్ల‌డిస్తే.. ఆ విష‌యాల్ని చెప్పాలి. కానీ.. అందులో త‌మ‌కు అనుకూల‌మైన వారికి సంబంధించిన అంశాల్ని తీసుకొని.. త‌మ‌కు ప్ర‌తికూలంగా ఉండే అంశాల్ని వ‌దిలేయ‌టం ఉంటుందా? అంటే అవున‌ని చెప్పాలి. ఈ విష‌యాన్ని తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్వ‌యంగా చెప్పారు.

తాజాగా త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా రెండు రోజుల క్రితం వ‌చ్చిన ఏబీపీ-సీ ఓట‌రు స‌ర్వేను ప్ర‌ముఖ మీడియా సంస్థ ఈనాడు ప్ర‌జెంట్ చేసిన వైనంపై నిప్పులు చెరిగారు. స‌ద‌రు స‌ర్వేలో ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే విప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 21 స్థానాలు జ‌గ‌న్ పార్టీకి వ‌స్తాయ‌ని.. నాలుగు స్థానాల్లో మాత్ర‌మే టీడీపీ గెలుస్తుంద‌ని పేర్కొన్నారు.

కానీ.. ఈనాడులో ఆ విష‌యాన్ని పేర్కొన‌కుండా.. మోడీకి సంబంధించిన అంశాల్ని మాత్ర‌మే ప‌బ్లిష్ చేసి వ‌దిలేశారే త‌ప్పించి.. జ‌గ‌న్ ఘ‌న విజ‌యాన్ని సాధిస్తాడ‌న్న విష‌యాన్ని మాత్రం ప‌బ్లిష్ చేయ‌క‌పోవ‌టాన్ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈనాడు పేప‌ర్ ను చూపిస్తూ.. చంద్ర‌బాబుకు ఏం కావాలో అలా ఎడిటింగ్ చేసి ఎల్లో మీడియా వార్త‌లు రాస్తుంద‌న్నారు. స‌ర్వేలో పేర్కొన్న‌ట్లుగా మ‌ళ్లీ ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పిన ఈనాడు.. ఏపీలో బాబుకు ఎన్ని సీట్లు వ‌స్తాయి.. జ‌గ‌న్ కు ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని మాత్రం ఇవ్వ‌క‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

ఏపీలో అన్యాయ పాలన సాగుతోందని, కానీ ప్రజల తరఫున ఎల్లో మీడియా దీనిని ప్రశ్నించదన్నారు. ఏపీలోని దయనీయ పరిస్థితి కనిపించదని, ఎల్లో మీడియాకు తాము గెలుస్తామ‌ని చెప్పే సర్వే కనిపించలేదన్నారు. అయినా.. స‌ర్వే వార్త ప్ర‌చురించిన‌ప్పుడు అందులోని అన్ని అంశాలు చెప్పాలే కానీ.. కొన్ని అంశాల్ని మాత్రం ప్ర‌చురించి.. మ‌రికొన్నింటిని విస్మ‌రించ‌టం ఏమిటో?