Begin typing your search above and press return to search.

జగన్ ఢిల్లీ టూర్ లో అసలు విషయం అదేనా... ?

By:  Tupaki Desk   |   3 Jan 2022 11:00 PM IST
జగన్ ఢిల్లీ టూర్ లో అసలు విషయం అదేనా... ?
X
జగన్ ఢిల్లీ టూర్ అన్నది చివరి నిముషం వరకూ బయటకు రాలేదు. ఒక రోజు ముందు మాత్రమే అది అందరికీ తెలిసింది. అంత గోప్యంగా జగన్ ఢిల్లీ టూర్ న్యూస్ ని ఉంచారు. సరే జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసారు, ఇతర కేంద్ర మంత్రులను కూడా మీట్ అయ్యారు. మరి జగన్ అర్జంటుగా ఢిల్లీ వెళ్లడానికి కారణం ఏంటి అంటే విపక్షాలు ఎవరికి వారు రకరకాలైన ఊహాగానాలను చేసుకున్నారు.

అయితే వైసీపీ వర్గాలు మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసమే జగన్ ఢిల్లీ టూర్ అని చెబుతున్నారు. నిజానికి జగన్ ఢిల్లీ లో వాయువేగాన ల్యాండ్ అవడానికి కారణాలు ఆర్ధికపరమైనవే అంటున్నారు. ఏపీకి రుణ పరిమితి మేరకు అప్పులు చేసుకునే అవకాశం 2021 డిసెంబర్ తో ముగిసిపోయింది. కొత్త ఏడాది మొదలవుతూనే ఖజానా ఖాళీగా ఉంది. ఇక ఈ ఆర్ధిక సంవత్సరం మరో మూడు నెలలు ఉంది.

ఇది గడవాలి అంటే కచ్చితంగా మరో పాతిక వేల కోట్ల రూపాయలు అవసరం. అయితే రుణపరిమితి మేరకు చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరానికి కొత్తగా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకునే వీలు లేదు. మరి మూడు నెలలు గడవడం అంటే ఎలా అన్నదే చర్చగా చింతగా ఉంది.

దాంతో జగన్ ఢిల్లీ బాట పట్టారని చెబుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను చూపించి తమ ప్రభుత్వానికి రుణ పరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని జగన్ ప్రధాని మోదీకి ప్రత్యేకంగా విజ్ఞప్తిని చేసినట్లుగా చెబుతున్నారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 42,472 కోట్ల రూపాయలుగా నిర్ధారించినా తర్వాత ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గించిందని జగన్ ప్రధానికి తెలిపారని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారని అంటున్నారు.

తమ తప్పు లేదని, గత ప్రభుత్వం అధిక అప్పులను చూపించి తమ రుణ పరిమితిలో కోత పెట్టడం ఇబ్బందిగా ఉందని కూడా జగన్ పేర్కొన్నారని అంటున్నారు. పైగా తమకు అప్పు చేసుకునే వెసులుబాటునే కల్పిస్తున్నారు తప్ప గ్రాంట్ గా ఇవ్వడంలేదని ఆయన వెల్లడించారని చెబుతున్నారు.

ఇలా అన్ని రకాల అంశాలను పరిగణన‌లోకి తీసుకుని 2021-22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారని సమాచారం. పనిలో పనిగా విభజన తరువాత ఏపీకి ఉన్న రెవిన్యూ లోటులో కేవలం నాలుగు వేల కోట్లను ఇప్పటిదాకా ఇచ్చారని, మిగిలిన 18 వేల‌ కోట్లను రిలీజ్ చేయాలని కూడా మోడీకి జగన్ వినతి చేశారని తెలుస్తోంది.

అలాగే తెలంగాణా నుంచి రావాల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్తు బకాయిలు రిలీజ్ అయ్యేలా చూస్తే ఏపీ ఇబ్బందుల నుంచి దాటుతుంది అని పేర్కొన్నారు. మొత్తానికి అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని కోరడానికే ఢిల్లీ వెళ్ళారని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ కూడా అలాగే సాగినట్లుగా తెలుస్తోంది. మరి ఇవే కాకుండా రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నా అవి కూడా ఏంటో చూడాల్సి ఉంది.