Begin typing your search above and press return to search.

హోదా కోసం బ‌లిదానాలొద్దు...జ‌గ‌న్ పిలుపు!

By:  Tupaki Desk   |   28 July 2018 8:42 AM GMT
హోదా కోసం బ‌లిదానాలొద్దు...జ‌గ‌న్ పిలుపు!
X

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌లు రాజ‌కీయ పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీపై కేంద్రం మొండి వైఖ‌రికి నిర‌స‌న‌గా రాజ‌కీయ‌నేత‌లతోపాటు ప్ర‌జ‌లు కూడా ప‌లు ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే, తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం ఓ చేనేత కార్మికుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చిత్తూరులో సుధాకర్‌(26) అనే చేనేత కార్మికుడు ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్ సుధాక‌ర్ జేబులో ల‌భించింది. ఈ నేప‌థ్యంలో సుధాక‌ర్ ఆత్మ బ‌లిదానంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని జగన్ విజ్ఞ‌ప్తి చేశారు. క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, అందరం స‌మ‌ష్టిగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని తెలిపారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ....సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన సుధాకర్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వ‌హించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. జ‌గ‌న్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్‌ తన వాణిని వినిపించాడ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో హోదా కోసం త‌మ కొడుకు ప్రాణ‌త్యాగం చేయ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. మ‌రోవైపు, సుధాక‌ర్ మృతి పట్ల స్థానిక‌ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రికత్త ఏర్ప‌డింది. ఇప్ప‌టిక‌కైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆఖిలపక్షం ఆధ్వర్యంలో తిప్పారెడ్డి ధర్నా చేపట్టారు. సుధాకర్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. తిప్పారెడ్డి - మిథున్ రెడ్డి....సుధాకర్‌ కుటుంబానికి చెరో లక్ష రూపాయలు అందించారు. సుధాకర్‌ మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) మదనపల్లె బంద్ కు వైసీపీ - సీపీఎం - సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి.అయితే, సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో హోదా కోసం గ‌తంలో మునుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడిన సంగ‌తి తెలిసిందే.