Begin typing your search above and press return to search.

తెలంగాణపై రాష్ట్రపతికి జగన్ కంప్లైంట్

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:46 AM GMT
తెలంగాణపై రాష్ట్రపతికి జగన్ కంప్లైంట్
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సంగతి తెలిసిందే. వివిధ అంశాల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు తన ఎంపీలతో కలిసిన జగన్.. ఈ సందర్భంగా ఐదు పేజీల ఫిర్యాదుల్ని ప్రణబ్ దా ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుతో పాటు.. ఏపీకి కేంద్రం చేయాల్సిన అంశాలతోపాటు.. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పడుతూ ఏపీకి న్యాయం చేయాలని కోరారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ధిక్కరిస్తోందని.. కృష్ణా.. గోదావరి నదుల మీద అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని.. దీర్ఘకాలంలో తెలంగాణకు దిగువున ఉన్నఏపీకి నష్టపోయేలా చేస్తాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదుల్ని చూస్తే.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇష్టారాజ్యంగా నిర్మిస్తోందని.. దీని వల్ల ఏపీ ప్రజానీకం తీవ్రంగా నష్టపోనుందని ఆయన వాపోయారు. విభజన చట్టంలోని సెక్షన్ 84(3) నిబంధనను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ధిక్కరిస్తోందని.. కృష్ణా.. గోదావరి నదుల మీద అనేక సాగునీటి ప్రాజెక్టులను కట్టేందుకు చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే నాగార్జునసాగర్.. కృష్ణా డెల్టా ప్రాంతం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులు తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నారని.. గోదావరి ద్వారా కూడా నీళ్లు తక్కువగా రావటంతో తొలిసారి ఏపీలో రైతులు రబీ పంట నష్టపోయారన్నారు.

నీటి కొరతను తీవ్రంగా ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటుందని రాష్ట్రపతి దృష్టికి జగన్ తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా దేశంలో రాజస్థాన లోని జైసల్మేర్ తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం కలిగినజిల్లా అని.. ఇక్కడి కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులకుగురి అవుతున్నారని చెప్పారు. ఒక కరువు నుంచి బయటపడే లోపే మరో కరువులో మగ్గే పరిస్థితి ఉందన్నారు. ఏడాదికి ఒక పంటకైనా రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని.. విభజన తర్వాత కృష్నానదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాస్ట్రాల నీటి అవసరాలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాయలసీమ అవసరాలను చూసేలా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ దృష్టి సారించాలన్న జగన్.. వివిధ రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులకు తగ్గట్లుగా చట్టబద్ధంగా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోని పక్షంలో వరదలు వస్తే మినహా అన్ని ప్రాంతాలకు నీరు రాని పరిస్థితి నెలకొందన్నారు. తమపై జగన్ చేసిన ఫిర్యాదులపై తెలంగాణ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.