Begin typing your search above and press return to search.

కోర్టుల ద్వారా ప్రభుత్వంపై టీడీపీ కక్ష సాధిస్తుంది .. సీఎం సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   22 July 2020 11:50 AM GMT
కోర్టుల ద్వారా ప్రభుత్వంపై టీడీపీ  కక్ష సాధిస్తుంది .. సీఎం సంచలన వ్యాఖ్యలు !
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా విపక్ష టీడీపీ దానికి అడ్డుతగులుతుంది అని ఇప్పటికే పలు మార్లు విమర్శలు చేసారు. తాజాగా మరోసారి నేడు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్ధితుల దృష్ట్యా సీఎం జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఏపీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై విపక్ష టీడీపీ పలుసార్లు కోర్టులను ఆశ్రయించి, కొంత వరకూ సత్పలితాలని కూడా సాధించింది. మరికొన్నింటిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోగలిగింది. టీడీపీ ఈ ధోరణి పై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. తాజాగా జగన్ తన మనసులో మాటను బయటపెట్టడంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలు నడుస్తున్నాయని, కోర్టుల ద్వారా ప్రతీ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని జగన్ తాజాగా విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సహాయం చేసే ప్రతీ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని, చివరకు కోర్టుల్లో పోరాటం చేసి ప్రభుత్వం పథకాలను అమలు చేయాల్సి వస్తోందని సీఎం జగన్ తెలియజేసారు. పేదల ఇళ్లస్ధలాల విషయంలోనూ టీడీపీ కోర్టుల్లో కేసులు వేసిందని, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అని అన్నారు. ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నామని, ఆ లోపు సానుకూల నిర్ణయం వస్తుంది అని అనుకుంటున్నట్టు తెలిపారు. టీడీపీ వాళ్లు ఏ రకంగా కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు, చివరకు పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు దీన్ని నివారించడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు.

సీఎం జగన్ భహిరంగంగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం మరొకటి ఉందని రాష్ట్ర ప్రజానీకం చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమాయించాలని టీడీపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్లు వేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ఈ రోజు నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. దీనిపై సీఎం జగన్ ప్రత్యేకంగా స్పందించకపోయినా కూడా ..అయన మాటలని బట్టి ఈ వ్యవహారాన్ని కూడా కలిపి టీడీపీ కోర్టుల ద్వారా ప్రభుత్వం పై కక్ష సాధిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.