Begin typing your search above and press return to search.

టీడీపీ చేసిన పాపాన్ని క‌డుగుతున్నాం: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   14 Jun 2022 10:30 AM GMT
టీడీపీ చేసిన పాపాన్ని క‌డుగుతున్నాం:  జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ విరు చుకుప‌డ్డారు. గ‌త టీడీపీ హ‌యాంలో చంద్ర‌బాబు చేసిన పాపాన్ని.. తాము క‌డుగుతున్నామ‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా.. త‌మ‌పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. స‌త్య‌సాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ విడుద‌ల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. గత చంద్ర‌బాబు ప్రభుత్వం అన్ని రకాలుగా రైతుల విషయంలో బకాయిలు పెట్టు పోయిందని విమ‌ర్శించారు.

ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, విత్తన కంపెనీలకు ఇలా అన్ని రకాలుగా బకాయిలు పెట్టి పోయిందని, ఆ పాపాన్ని తాము భ‌రిస్తూ.. క‌డుగుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అవన్నీ త‌మ‌ ప్రభుత్వం చెల్లించి అదనం గా రైతులకు సహాయం చేస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 15.61 లక్షల మంది రైతులకు రూ. 2,977.82 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చామ‌ని చెప్పారు. టీడీపీ హయాం ఐదేళ్లలో అందిన పరిహారం 3,411.2 కోట్లే ఇచ్చారని తెలిపారు.

రైతులకు సాయం చేసే విషయంలో దేశంలోని పోటీపడుతున్నామ‌ని జ‌గ‌న్ తెలిపారు. మన రాష్ట్రాన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మూడేళ్లలోనే రైతులకు ఇచ్చిన ఇన్సూరెన్స్ 6680 కోట్లుగా ఉంద‌న్నారు. మూడేళ్లలో ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 1600 కోట్లకు పైగా ఇచ్చామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

పదవ తరగతి పరీక్షలపై ఏమ‌న్నారంటే..

ఇటీవ‌ల ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పాస్ శాతం త‌గ్గ‌డం.. విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని జ‌గ‌న్‌.. తాజాగా స్పందించారు. 10 పరీక్షల్లో 67 శాతం మంది మాత్రమే పాసయ్యారని తెలిపారు. మోడీ పాలించిన గుజరాత్ లో 65 శాతం మంది పాసయ్యారని అన్నారు. రెండు సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత పరీక్షలు జరిగాయని, రెండేళ్లు పూర్తిగా చదువుకు దూరమయ్యారని అందుకే పాస్ శాతం త‌గ్గింద‌ని చెప్పారు.

చదువుల్లో నాణ్యతను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిని కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమ‌ర్శించారు. పిల్లలకు మరోసారి పరీక్షలు నిర్వహించి.. వారిని రెగ్యులర్ పాస్ కింద చూపిస్తామ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

కోనసీమ అల్ల‌ర్ల‌పై ఏమ‌న్నారంటే..

ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దానిని కూడా రాజకీయం చేశారని జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. అక్కడ అల్లర్లు సృష్టించి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక బీసీ మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యే ఇంటి పై దాడి చేయించారని విమ‌ర్శించారు. మంత్రివర్గంలో 70 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారని జ‌గ‌న్ చెప్పారు. కోన‌సీమ అల్ల‌ర్ల పాపం ప్ర‌తిప‌క్షాల‌దేన‌ని చెప్పారు.