Begin typing your search above and press return to search.

అచ్చెన్నా అంత మాట అనేశావే..?

By:  Tupaki Desk   |   17 Oct 2016 5:10 AM GMT
అచ్చెన్నా అంత మాట అనేశావే..?
X
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన భారీ హామీల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మొదటి ఐదు హామీల్ని చూస్తే.. రైతుల రుణమాఫీ.. డ్రాక్వా సంఘాల రుణ మాఫీ.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి.. కాపుల్ని బీసీల్లో చేర్చటం. ఎన్నికల్లో తానిచ్చిన ముఖ్యమైన హామీల్లో ఎన్నింటిని ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమలు చేశారన్నది అందరికి తెలిసిన విషయమే.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని అమలు చేయటం ఒక ఎత్తు. సాధ్యం కాని సమయంలో.. అందుకు కార‌ణ‌మ‌వుతున్న‌ ఇబ్బందుల్నిప్రస్తావించి.. పెద్ద మనసుతో తమ ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలని అర్థించటం ఒక ఎత్తు. అలాంటిదేమీ లేకుండా కీలకమైన హామీని ఒక మంత్రి ప్రస్తావించటమే కాదు.. తామిచ్చిన హామీని అమలు చేయ‌డం సాధ్యం కాదని తేల్చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో కీలకమైన నిరుద్యోగులకు భృతిని తాము అమలు చేయలేమని.. అమలు సాధ్యం కాదని తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు తేల్చేశారు. ఆదివారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో త‌న‌ పేషీని ప్రారంభించిన అచ్చెన్నాయుడు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల్ని కల్పించటంపై తమ సర్కారు దృష్టి పెట్టిందన్న ఆయన.. నిరుద్యోగ భృతి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేయటం గమనార్హం. నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అధ్యయనం చేశామని.. చాలా తక్కువ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పిన ఆయన.. ఏపీలో అలాంటి హామీ అమలు చేయలేమని చెప్పేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యయనం చేసే కన్నా.. ఎన్నికల వేళ.. హామీ ఇచ్చేటప్పుడే ఇలాంటి అధ్యయనాలు చేసి ప్రజలకు మాట ఇస్తే బాగుంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/