Begin typing your search above and press return to search.

మొదటిసారి ఓటేస్తే.. ఆ కిక్కే వేరప్పా!

By:  Tupaki Desk   |   7 Dec 2018 3:58 PM GMT
మొదటిసారి ఓటేస్తే.. ఆ కిక్కే వేరప్పా!
X
తెలంగాణలో తొలి అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కళాశాలల్లో యువతను ఓటర్లుగా చేర్పించడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవాలని పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులు సత్ఫలితాలు ఇవ్వడంతో యువత ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చింది.

18 -19 సంవత్సరాల వయసు కలిగిన యువతకు మొదటి సారి ఓటు హక్కు రావడంతో వారిలో అత్యధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 20 - 39 మధ్య వయసున్న వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎక్కువ శాతం యువత ఓటు హక్కు వినియోగించుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను నిర్ణయించేది యువతే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువ ఓటర్లు నిజాయితీ కలిగిన, పనిచేసే అభ్యర్థులకే ఓటు వేశామని చెబుతున్నారు. మొదటిసారి ఓటు వేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందంటున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు యువత పోటెత్తింది. ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంది.