Begin typing your search above and press return to search.

ఆ కమెడియన్ వైసీపీలో చేరాడు

By:  Tupaki Desk   |   6 Aug 2018 1:21 PM IST
ఆ కమెడియన్ వైసీపీలో చేరాడు
X
ఎన్నికలు సమీపిస్తుండగా.. సినీ తారలు రాజకీయ పార్టీల్లో తీర్థం పుచ్చుకోవడం మామూలే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ రాజకీయాలు వేడెక్కుతుండగా.. కొందరు సినీ తారలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి.. పృథ్వీ.. ఛోటా కే నాయుడు లాంటి సినీ ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్‌ కు మద్దతుగా మాట్లాడారు. పోసాని.. పృథ్వీ లాంటి వాళ్లు వైకాపా తరఫున పోటీ చేయడమో.. ప్రచారం చేయడమో ఖాయమని తెలుస్తోంది. తాజాగా కమెడియన్ కమ్ హీరో కృష్ణుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ సమక్షంలో కృష్ణుడు వైఎస్సార్‌ సీపీలో చేరాడు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్‌ బాబు.. సర్రాజు.. సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ఆకర్షితుడునై తాను పార్టీలో చేరినట్లు కృష్ణుడు తెలిపాడు. ఏపీలో వైయస్సార్‌సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని అతనన్నాడు. ఒకప్పుడు కృష్ణుడు కమెడియన్‌ గానే కాక హీరోగానూ రాణించాడు. ‘వినాయకుడు’ అప్పట్లో మంచి హిట్టయింది. ఆ తర్వాత ‘విలేజ్ లో వినాయకుడు’.. ‘పప్పు’ లాంటి సినిమాల్లో అతను కథానాయకుడిగా నటించాడు. కమెడియన్ గానూ పదుల సంఖ్యలో సినిమాలు చేశాడు. ఈ మధ్య అతడికి అవకాశాలు తగ్గాయి. ఇక జగన్ పాదయాత్ర విషయానికి వస్తే తన 230వ రోజు పాదయాత్రను ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి క్రాస్‌ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం మీదుగా శంఖవరం వరకు కొనసాగనుంది.