Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లో మాస్కు పెట్టుకోకుంటే ఎంత పెద్ద శిక్ష అంటే?

By:  Tupaki Desk   |   29 Aug 2020 12:30 AM GMT
ఫ్లైట్ లో మాస్కు పెట్టుకోకుంటే ఎంత పెద్ద శిక్ష అంటే?
X
కరోనా కాలంలో అందరూ మాస్కులు పెట్టుకోవటం.. చేతికి శానిటైజర్ రాసుకోవటం.. భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరి. ఈ విషయంపై ఎంత ప్రచారం చేసినా.. చాలామందికి పట్టటం లేదు. ఇలాంటి వారి కారణంగా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్కులు పెట్టుకోకుంటే జరిమానాలు విధిస్తామని చెప్పినా.. పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారి పుణ్యమా అని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అలాంటి సమస్యే విమాన ప్రయాణికులతోనే ఎదుర్కొంటున్నారు. మాస్కు పెట్టుకోని ప్రయాణికుల కారణంగా ఇతర ప్రయాణికులతో పాటు విమానసిబ్బందికి వైరస్ ముప్పు ఉంటుందన్నది తెలిసిందే. అందుకే డీజీసీఏ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. విమానంలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఎవరైనా ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా విమానంలో మాస్కులు పెట్టుకోకుండా ప్రయాణిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. విమానాల్లో ఉద్దేశపూర్వకంగా మాస్కులు ధరించని వ్యక్తులను నో ఫ్లై జాబితాలో పెట్టేస్తామని పేర్కొంది. ఈ జాబితాలో ఉన్న వారిని విమాన ప్రయాణాలకు అనుమతించరు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని విమానయాన శాఖ పేర్కొంది.

అయితే.. విమాన ప్రయాణంలో ఆహారం తీసుకునే సమయంలో.. డ్రింక్స్ తాగే సమయంలో మాత్రం మాస్కు లేకున్నా ఫర్లేదని.. అందుకు అనుమతిస్తామని పేర్కొనటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా ఒక రోజు కేసులు నమోదయ్యాయి. 77266 కొత్త కేసులతో పాటు.. రోజులో 1057 మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం దేశంలో 7.42లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.