Begin typing your search above and press return to search.

రానున్న రోజుల్లో మీ ఫోన్లో ‘కో-విన్’ యాప్ ఉండాల్సిందే.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   9 Dec 2020 11:05 AM IST
రానున్న రోజుల్లో మీ ఫోన్లో ‘కో-విన్’ యాప్ ఉండాల్సిందే.. ఎందుకంటే?
X
యావత్ ప్రపంచం నెలల తరబడి ఎదురుచూసిన కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. తాజాగా బ్రిటన్ లో సామాన్యులకు టీకా వేయటం షురూ చేశారు. అత్యవసర వినియోగానికి అంటూ అనుమతి పొందిన ఈ వ్యాక్సిన్ ఈ నెల 25 నుంచి మన దేశంలోనూ వేయటం షురూ చేస్తారు. భారత్ లాంటి బిన్నత్వం ఉన్న దేశంలో వ్యాక్సిన్ వేయటం అంత తేలికైన విషయం కాదు.

అందుకే.. కేంద్రం ఒక వినూత్నమైన ప్లాన్ సిద్దం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా.. దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఒక ఉచిత మొబైల్ యాప్ లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘కో-విన్’ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ ను రూపొందించారు.

ఇందులో టీకా కోసం పేరును నమోదు చేసుకోవటంతో పాటు.. వ్యాక్సిన్ కు సంబంధించి సమాచారంతో పాటు.. మరిన్ని వివరాల్ని పొందుపరుస్తారు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపర్చనున్నారు. ఈ కొత్త యాప్ లో ఐదు అంశాలు కీలకం కానున్నాయి.

అడ్మినిస్ట్రేటర్.. రిజిస్ట్రేషన్.. వ్యాక్సినేషన్.. బెలిఫిషరీ ఎకనాలెడ్జ్ మెంట్.. రిపోర్టు మాడ్యూళ్లు ఉండనున్నాయి. ఎవరికి వ్యాక్సిన్ వేసినా.. దానికి సంబంధించిన క్యూఆర్ ఆధారిత ధ్రువపత్రంతో పాటు.. ఎన్ని వ్యాక్సిన్ సెషన్లు నిర్వహించారు? లాంటి సమాచారం అందులో ఉండనుంది. అంతేకాదు.. ఎంతమంది వ్యాక్సిన్ కోసం వచ్చారన్న వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు ఆరోగ్య సేతు ఏ రీతిలో అయితే ప్రతి మొబైల్ లోనూ అవసరమో.. తాజాగా కో-విన్ యాప్ కూడా మన మొబైల్ లో అతి కీలకం కానుందని చెప్పక తప్పదు.