Begin typing your search above and press return to search.

త్వరలో..మీ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే డబ్బులు డిపాజిట్ చేయనక్కర్లేదు

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:41 AM GMT
త్వరలో..మీ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే డబ్బులు డిపాజిట్ చేయనక్కర్లేదు
X
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. తప్పనిసరిగా ఆ బ్యాంకుకే వెళ్లి డబ్బులు నమోదు చేస్తే కానీ.. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. కానీ.. ఇందుకు భిన్నమైన సదుపాయం త్వరలోనే చేరనున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త విధానంలో మీకు ఎస్ బీఐలో అకౌంట్ ఉన్నా ఆంధ్రా బ్యాంకులో కూడా డబ్బులు కట్టేయొచ్చు. ఆన్ లైన్ పద్దతిలో ఆంధ్రా బ్యాంకు కౌంటర్లో డబ్బులు తీసుకున్నా.. ఆ నగదు మాత్రం ఎస్ బీఐ అకౌంట్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందన్న విషయం మీద క్లారిటీ లేనప్పటికి త్వరలోనే ప్రజల చెంతకు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు. ఈ సరికొత్త ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెర మీదకు తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ద్వారా వివిధ బ్యాంకుల మధ్య చెల్లింపులు జరిగే పద్దతిని ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళుతూ.. బ్యాంకు ఖాతాదారులకు సైతం ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న ఈ విధానం అమల్లోకి వస్తే.. మీకు ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు మాత్రమే వెళ్లి డబ్బు డిపాజిట్ చేయటం.. డబ్బులు తీసుకోవటం లాంటి వాటితో పని ఉండదు. బ్యాంకు ఏదైనా ఫర్లేదు డబ్బులు తీసుకుంటుంది.. డబ్బులు ఇస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే బ్యాంకు ఖాతాదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్పక తప్పదు. అదే సమయంలో ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు డిపాజిట్ చేసేలా మార్పులు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందంటున్నారు. అదే జరిగితే.. ఖాతాదారులకు భారీ మేలు జరుగుతుందని చెప్పక తప్పదు.