Begin typing your search above and press return to search.

5ల‌క్ష‌ల పైన ఐటీ భారం త‌ప్పించుకోవ‌డం ఎలా?

By:  Tupaki Desk   |   2 Feb 2019 9:51 AM GMT
5ల‌క్ష‌ల పైన ఐటీ భారం త‌ప్పించుకోవ‌డం ఎలా?
X
కీల‌క‌మైన‌ సార్వత్రిక ఎన్నికలకు ముందు సర్వజనాకర్షక బడ్జెట్‌ ను మోడీ సర్కారు ప్రవేశపెట్టింది. మధ్యతరగతి వర్గాలకు - ముఖ్యంగా వేతన జీవులకు భారీ ఊరటనిస్తూ ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. తద్వారా గత నాలుగేళ్లుగా వస్తున్న డిమాండ్లను చివరి ఏడాది మధ్యంతర బడ్జెట్‌ లో నెరవేర్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను శుక్రవారం పార్లమెంట్‌ లో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన బడ్జెట్‌ లో సగటు పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకునే ప్రకటనలే ఉన్నాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు దిగువన ఉన్న వారికే ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఉంది. అయితే దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. సెక్షన్ 87ఏ కింద పూర్తిస్థాయి పన్ను రిబేటు ఇచ్చారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ.18,500 కోట్ల ఆదాయం దూరం కానుంది. రూ.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారు ఇప్పుడున్న శ్లాబులు - రేట్ల ప్రకారమే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, వార్షిక ఆదాయం రూ.6.50 లక్షల వరకున్నవారు కూడా ఐటీ నుంచి మినహాయింపు పొందవచ్చని - పీపీఎఫ్ వంటి సేవింగ్స్‌ ల్లో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులతో ప్రయోజనం అందుకోవచ్చని గోయల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నిర్ణయం 3 కోట్ల మంది స్వయం ఉపాధి కలిగిన - సీనియర్ సిటిజన్లకు లాభిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా పెన్షన్ - మెడిక్లెయిముల్లో పెట్టుబడులకు ఊతమివ్వగలదన్నారు. కాగా, స్టాండర్డ్ డిడక్షన్‌ ను కూడా రూ.40,000 నుంచి 50,000లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కూడా 3 కోట్ల మంది వేతన జీవులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

ఇక ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయం దాటినా ప‌న్ను భారం త‌ప్పించుకోవాలంటే...రూ.5.50 లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. వీటికి తోడు సెక్షన్ 80 సీ కింద పీపీఎఫ్ - ఈపీఎఫ్ - పిల్లల ట్యూషన్ - ఎస్‌ పీఎఫ్‌ లో పెట్టుబడి తదితర వాటితో మరో లక్షన్నర వరకు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ప్రీమియం హెల్త్ ఇన్సురెన్స్ - సీనియర్ సిటిజన్స్ - ఇంటి రుణం (రూ.2 లక్షలు).. ఇలా దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వచ్చినా ట్యాక్స్ లేకుండా చూసుకోవచ్చు.

ఇక బ్యాంక్ - పోస్టాఫీస్ డిపాజిట్లపై ఏటా పొందే వడ్డీ ఆదాయంలో రూ.40,000 వరకు పన్ను చెల్లించనక్కర్లేదని తాజా బడ్జెట్‌ లో గోయల్ వరమిచ్చారు. ప్రస్తుతం ఈ మినహాయింపు రూ.10,000 వరకే ఉండటం గమనార్హం. ఈ నిర్ణయంతోనూ కోట్లాది మందికి లబ్ధి చేకూరనుండగా - బ్యాంకులు - తపాలా శాఖల్లో సురక్షిత పెట్టుబడులకు దోహదం చేయగలదని అటు ప్రభుత్వం, ఇటు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే గ్రాట్యుటీని రూ.10 లక్షలకు మించి అందుకున్న వారికి ఊరటనిచ్చిన కేంద్రం.. రూ.20 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చారు.