Begin typing your search above and press return to search.

ఆహారపు అలవాట్లు, వ్యాయమంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

By:  Tupaki Desk   |   31 July 2020 12:30 AM GMT
ఆహారపు అలవాట్లు, వ్యాయమంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?
X
ప్రపంచ దేశాలు కరోనాతో భయాందోళనకు గురవుతున్నాయి. ఈ మహమ్మారికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సీన్ లేదు. వ్యాక్సీన్ కోసం శాస్త్రవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఈ సమయంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి/ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇమ్యునాలజీ నిపుణులు రోగ నిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పళ్లు, జ్యూస్‌లు, విటమిన్ సీ ట్యాబ్లెట్లు, ఎండకు ఎక్కువగా ఉండటం వంటి సూచనలు చేస్తున్నారు. అయితే ఆహారపు అలవాట్లతో రోగనిరోధకశక్తి పెరుగుతుందా అనే అంశంపై సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్, ఇమ్యూనాలజీ నిపుణులు రామ్ విశ్వకర్మ పలు అంశాలు వెల్లడంచారు.

రోగనిరోధక శక్తి అనేది క్లిష్టమైన అంశమని, దీనిపై ప్రజలకు అవగాహన రాలేదని చెప్పారు. రోగగ్రస్తులను చేసే వ్యాధికారక యాంటీజెన్స్‌ను ఎదుర్కోవడానికి సహజసిద్ధంగా శరీరంలో యాండీబాడీస్ ఉంటాయని, అలాగే, సహజ రోగనిరోధక శక్తి మనిషిని నిత్యం కాపాడుతూ ఉంటుందన్నారు. ఈ సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాలు, న్యూట్రోఫిల్స్, టీసెల్స్, బీసెల్స్, యాంటీబాడీస్‌తో కూడిన రక్షణాత్మక వ్యవస్థ ఉంటుందని, ఈ కణాలను సైటోకీన్స్ ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఇది ప్రొటీన్ ఇమ్యూన్ కణాలకు సిగ్నలింగ్ వ్యవస్థ వంటిదన్నారు.

ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమన్నారు. తక్కువ రోగనిరోధక శక్తి ఉంటే ఎక్కువ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో విటమిన్ సి, జింక్ ట్యాబ్లెట్లతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చుననే అపోహలు ఉన్నాయని, వీటి వల్ల కొంతమంది కిడ్నీ, లివర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఆహారం ద్వారా రోగనిరోధక శక్తి లభిస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయమం, జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చునని దాదాపు అందరూ చెబుతున్నారు. వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థ బలంగా ఉంచే కణాలు బలోపేతమవుతాయని చెబుతున్నారు. ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం కోసం కేటాయించాలని చెబుతున్నారు.