Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ కు సెల్యూట్ చేయాల్సిందే..

By:  Tupaki Desk   |   7 Sep 2017 7:29 AM GMT
ఆ క్రికెటర్ కు సెల్యూట్ చేయాల్సిందే..
X
శ్రీలంక పర్యటనలో జైత్రయాత్రను కొనసాగిస్తూ.. ఈ టూర్లో చివరిదైన ఏకైక టీ20లోనూ ఘనవిజయం సాధించింది. భీకర ఫామ్ కొనసాగిస్తూ కెప్టెన్ కోహ్లి మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇవేవీ కూడా సోషల్ మీడియాలో క్రీడాభిమానులకు పెద్దగా పట్టట్లేదు. అసలు భారత క్రికెట్ జట్టులోనే లేని ఓ ఆటగాడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతడి మీద అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ క్రికెటర్ గ్రేట్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. ఆ క్రికెటర్ ఆకట్టుకున్నది ఆటతో కాదు.. తన గొప్ప మనసుతో. ఆ ఆటగాడు మరెవరో కాదు.. గౌతమ్ గంభీర్.

కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన గంభీర్.. క్రికెటర్ గా కొంచెం పేరు సంపాదించినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తన పేరిటే ఓ ఫౌండేషన్ పెట్టి అతనే కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలు ఖర్చు చేస్తున్నాడు. ఐతే చాలామంది లాగా పన్ను మినహాయింపుల కోసమో.. పేరు కోసమో అతను వెంపర్లాడింది లేదు. కొన్ని నెలల కిందట తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెందిన పిల్లలందరి చదువు బాధ్యతల్ని తీసుకుని తన పెద్ద మనసు చాటుకున్న గంభీర్.. తాజాగా ఉగ్రదాడిలో చనిపోయిన జమ్మూ కాశ్మీర్ ఎస్సై అబ్దుల్ రషీద్ కూతురి బాగోగులు చూసేందుకు ముందుకొచ్చాడు.

తన తండ్రి చనిపోయిన సందర్భంగా బోరున విలపిస్తున్న జోహ్రా ఫొటోను సోషల్ మీడియాలో చూసి కదిలిపోయిన గంభీర్.. ఆమె చదువుకయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అతను కదిలించే మెసేజ్ పెట్టాడు. అది వైరల్ అయింది. తనను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గంభీర్ కు జోహ్రా థ్యాంక్స్ చెబితే.. తనకు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదని.. తన ఇద్దరు కూతుళ్ల లాగే నువ్వూ అంటూ గంభీర్ స్పందించాడు. ఈ సంభాషణ అందరినీ కదిలించింది. గంభీర్ మీద ప్రశంసలు కురిపిస్తూ.. సెలబ్రెటీలు అతడి బాటలో నడిచి అభాగ్యుల్ని ఆదుకోవాలని పిలుపునిస్తున్నారు నెటిజన్లు.