Begin typing your search above and press return to search.

రచ్చగా మారిన ఆడియో.. ఎస్ బీఐ చీఫ్ ను ఘాటుగా తిట్టిన ఆర్థికమంత్రి?

By:  Tupaki Desk   |   16 March 2020 11:13 AM IST
రచ్చగా మారిన ఆడియో.. ఎస్ బీఐ చీఫ్ ను ఘాటుగా తిట్టిన ఆర్థికమంత్రి?
X
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రజలకు చేరువ అయ్యాక.. పలు సంచలన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏది నిజం? మరేది అబద్ధమన్నది ఇప్పుడు చాలా కష్టంగా మారింది. వీడియోలు.. ఆడియోలు.. ఇలా ఆన్ లైన్ లోకి ప్రత్యక్షమవుతున్న కొన్నింటి పుణ్యమా అని కొత్త సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి తెర మీదకు వచ్చింది.

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఇండియా చీఫ్ రజనీష్ కుమార్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో తిట్టేశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎస్ బీఐ చీఫ్ ను ఘోరంగా అవమానించారన్నట్లుగా వైరల్ అవుతున్న ఆడియోక్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆడియో క్లిప్ ఎంతమేర నిజమన్నది పక్కన పెడితే.. ఇందులో అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి.

క్లిప్ లో ఉన్నదాని ప్రకారం.. రుణవితరణ పెరగకపోవటానికి కారణం బ్యాంకు తీరేనని చెబుతూ.. అసోం తేయాకు తోటల్లో పని చేసే వారికి రుణాలు లభించకపోవటానికి కారణం మీరేనంటూ నిర్మలా సీతారామన్ బ్యాంక్ ఛైర్మన్ ను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిన వైనం కనిపిస్తోంది.

ఎస్ బీఐ జాలి లేని బ్యాంకుగా ఆక్షేపించిన కేంద్రమంత్రి మాటలు ఇప్పు సంచలనంగా మారాయి. ఎస్ బీఐ ఛైర్మన్ ను కేంద్ర ఆర్థికమంత్రి ఘోరంగా అవమానించారని.. ఇదంతా ఫిబ్రవరి 27న గువాహటిలో నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఆడియోక్లిప్ ను అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బ్యాంకు ప్రతిష్ఠ ను దెబ్బ తీసేందుకే ఇలాంటివి వైరల్ చేస్తున్నారని.. తక్షణమే ఈ అంశంపై విచారణ జరపాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ క్లిప్ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది.