Begin typing your search above and press return to search.

ఓవైసీని యూపీ సీఎం ఎందుకు పొగుడుతున్నాడు?

By:  Tupaki Desk   |   10 July 2021 12:30 AM GMT
ఓవైసీని యూపీ సీఎం ఎందుకు పొగుడుతున్నాడు?
X
కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మోడీ పెద్దపీట వేశాడు. ఏకంగా 77 మంది ఎంపీలుంటే 14మందికి కేంద్రమంత్రి పదవులు ఇచ్చారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే మోడీ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆధిత్యనాథ్ నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని బీజేపీ స్పష్టం చేసింది.

యూపీలో బలమైన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీనే. ఇప్పుడు సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ ఎలాగైనా సరే యూపీలో బీజేపీని ఓడించడానికి బీఎస్పీ, కాంగ్రెస్ తో జతకట్టాలని డిసైడ్ అయ్యారు. యోగి ఆధిత్యనాథ్ కు దీటుగా తమ పార్టీ బరిలోకి దిగుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా సమాజ్ వాదీతో జతకట్టేందుకు రెడీ అయ్యింది. ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది.

అయితే రాష్ట్రంలో ఇంత మంది పెద్ద నాయకులున్నా కూడా వీరు ఎవరి గురించి యోగి ఆధిత్యనాథ్ మాట్లాడడం లేదు. తమ రాష్ట్రానికి అస్సలు సంబంధం లేని.. హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీనే తమ ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. ఓవైసీ విసిరే సవాల్ ను తాము స్వీకరిస్తామని మత ప్రాతిపదికన రాజకీయాలు రాజేసే ఎత్తుగడ వేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ 'దేశంలోని పెద్ద నాయకుల్లో ఓవైసీ ఒకరు. ఆయన కంటూ ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆయన మాకు సవాల్ విసిరితే దాన్ని స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. దీనిలో ఎలాంటి సందేహాలు లేవు' అని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.

అయితే ఓవైసీ కూడా ఇప్పటికే యోగి ఆధిత్యనాథ్ కు గట్టి సవాల్ చేశారు. 'ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధిత్యనాథ్ మరోసారి ఉత్తరప్రదేశ్ సీఎం కాకుండా మేం అడ్డుకుంటాం' అని ఓవైసీపీ సవాల్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లో అస్సలు బలం లేని ఎంఐఎం పార్టీకి, ఓవైసీనీ ఆ రాష్ట్రం సీఎం యోగి ప్రధానంగా టార్గెట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ లను కాదని ఓవైసీని టార్గెట్ చేయడం వెనుక మతలబు ఓట్లను చీల్చడమేనన్న టాక్ నడుస్తోంది.సంప్రదాయంగా వస్తున్న ముస్లిం, మైనార్టీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లను చీల్చి ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా యోగి ఈ స్కెచ్ గీశాడని.. అసదుద్దీన్ ను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు.