Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ సైతం యోగి దెబ్బకు సొమ్మసిల్లిపోయిందిగా?

By:  Tupaki Desk   |   10 March 2022 2:30 PM GMT
సెంటిమెంట్ సైతం యోగి దెబ్బకు సొమ్మసిల్లిపోయిందిగా?
X
సెంటిమెంట్ కు సైతం షాకిచ్చే సత్తా యోగికే సొంతమన్నది ఎలానో చెప్పే ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు విషయాల్ని చెప్పి.. విషయంలోకి వెళదాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో వీటికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

తెలంగాణ విషయానికే వద్దాం.. తెలంగాణ స్పీకర్ గా పని చేసిన వారెవరూ.. తర్వాతి ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకపోవటం కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖా మంత్రిగా పని చేసిన వారు ఎవరైనా సరే.. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సు కూడా ఉండదు. ఇలా కొన్ని సెంటిమెంట్లు బలంగా కనిపిస్తుంటాయి. వీటిని చూశాక.. వాటిని నమ్మకుండా ఉండలేం.

తోపులాంటి నేతలు సైతం ఇలాంటి సెంటిమెంట్లకు బలైన ఉదంతాలు చాలానే కనిపిస్తాయి. కానీ.. వీరికి కాస్త భిన్నం యోగి ఆదిత్యనాథ్. ఈ కాషాయధారి దెబ్బకు సెంటిమెంట్ సైతం సొమ్మసిల్లి పడిపోయిందన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే.. యూపీకి సంబంధించి ఒక సెంటిమెంట్ ఒకటుంది. అదేమంటే.. నొయిడా పారిశ్రామిక నగరం యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోకి వస్తుంది. ఈ సిటీని సందర్శించిన ముఖ్యమంత్రి ఎవరూ కూడా తర్వాతి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు.

దీనికి ఉదాహరణగా వీరభద్ర సింగ్ 1980లో.. ఎన్ డీ తివారీలను చెబుతారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నగరాన్ని సందర్శించిన తర్వాత.. తమ పదవుల్ని కోల్పోయారు. ఈ కారణంతోనే ఆ మధ్యన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అఖిలేశ్ యాదవ్ ఆ నగరం జోలికే వెళ్లలేదు. తన పదవీ కాలం మొత్తం ఆ నగరాన్ని పర్యటించకుండానే ఉండిపోయారు. కానీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం రోటీన్ కు భిన్నంగా 2018లో పర్యటించారు.

ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ రియాక్టు అవుతూ.. ఫ్యూచర్ లో ఈ పర్యటన ప్రభావం పడుతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వాదనను పలువురు ఏకీభవించారు. అయితే.. వారందరి అంచనాలకు భిన్నంగా యోగి మాత్రం తాజా ఎన్నికల్లో విజయం సాధించటమే కాదు.. మరోసారి దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానుండటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూసినోళ్లు.. యోగినా మజాకానా? అంటున్నారు. సెంటిమెంట్ కు సైతం షాకిచ్చిన సత్తా యోగిదంటూ తెగ పొగిడేస్తున్నారు.