Begin typing your search above and press return to search.

హమ్మయ్యా... ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి పేరు లేదంట

By:  Tupaki Desk   |   13 Sept 2020 5:40 PM IST
హమ్మయ్యా... ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి పేరు లేదంట
X
నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, అందులో 53 మంది చనిపోగా, 500 మందికి పైగా గాయపడిన వైనం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయగా... అందులో నిందితులుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ ల పేర్లున్నాయని శనివారం పెను దుమారం రేగింది. మెయిన్ స్ట్రీమ్ పత్రికలతో పాటు ఛానెళ్లు కూడా ఈ వార్తలను ప్రముఖంగానే ప్రసారం చేశాయి. అయితే చావు కబురు చల్లగా చెప్పిన చందంగా.. ఆలస్యంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అటు ఏచూరికి గానీ, ఇటు యోగేంద్రకు గానీ సంబంధం లేదని, చార్జీషీట్లో వారి పేర్లు లేవని ప్రకటించారు.

డిల్లీ అల్లర్ల కేసులో తన పేరుందన్న ప్రచారంపై ఏచూరీ కూడా చాలా వేగంగా స్పందించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు మోదీ సర్కారు చెప్పినట్టుగానే నడుస్తోందని, ఈ క్రమంలోనే ఢిల్లీ అల్లర్ల కేసులో తన పేరును చేర్చిందని ఆరోపించారు. దాడులకు కారణంగా నిలిచిన ప్రసంగాలు చేసిన వారిపై ఎందుకు విచారణ చేయడం లేదని కూడా ఏచూరి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం సాయంత్రమే ట్విట్టర్ వేదికగా ఏచూరి వరుస ట్వీట్లను సంధించారు. యోగేంద్ర కూడా ఏచూరి మాదిరే ఢిల్లీ పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు.

ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి, యోగేంద్రలతో పాటు ఆర్థిక వేత్త జయతీ ఘోష్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పేర్లున్నాయని శనివారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమయ్యాయి. ఈ వార్తలు వెలువడిన వెంటనే ఏచూరి, యోగేంద్రలు డిల్లీ పోలీసులపై విరుచుకుపడ్డారు. అయితే బయట ఇంత నానా యాగీ సాగుతున్నా... ఢిల్లీ పోలీసులు తమకు ఏమీ పట్టనట్టుగానే వ్యహరించారు. తీరా అంతా అయిపోయాక ఆదివారం ఉదయం తాపీగా కేసులో ఏచూరి, యోగేంద్రల పేర్లు లేవని ప్రకటించారు.