Begin typing your search above and press return to search.

కలెక్టర్ మీద అలిగిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   25 Oct 2021 11:00 PM IST
కలెక్టర్ మీద అలిగిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖులు ఏదైనా కార్యక్రమానికి సంబంధించి హాజరు కావాలన్నప్పుడు.. ఆ ప్రోగ్రాంకు మరో ప్రముఖులు కూడా హాజరవుతున్నప్పుడు.. సమన్వయంతో వ్యవహరించి.. ఇరువురికి ఇబ్బంది లేని రీతిలో ప్లాన్ చేసుకోవటం కనిపిస్తుంది. మరేం జరిగిందో కానీ.. తాజాగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే విషయంలో జిల్లా కలెక్టర్ అనుసరించిన వైనం ఇప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధి మనసు నొచ్చుకునేలా చేసింది. అలిగిన సదరు ఎమ్మెల్యే కలెక్టర్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ తీరుకు రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మీ మనస్తాపానికి గురయ్యారు. గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఆ పని చేయకుండా అలిగి వెనక్కి వెళ్లిపోయారు. దీనికి కారణం.. జిల్లా కలెక్టర్ చెప్పిన సమాయానికి రాకపోవటమే. చింతూరుకు వచ్చిన ఎమ్మెల్యే.. అక్కడ నిర్మించిన గ్రంధాలయాన్ని ప్రారంభానికి హాజరవుతానని చెప్పిన కలెక్టర్ కోసం వెయిట్ చేశారు.

మరోవైపు జిల్లా కలెక్టర్ వేర్వేరు చోట్ల వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. భద్రచలం వెళ్లి శ్రీసీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు. షెడ్యూల్ లో భాగంగా రావాల్సిన సమయానికి రాని జిల్లా కలెక్టర్ కోసం ఎమ్మెల్యే ధనలక్ష్మీ గంటల కొద్దీ వెయిట్ చేశారు.అయినప్పటికీ ఆయన రాకపోవటంతో అలిగిన ఆమె.. గ్రంధాలయ ప్రారంభోత్సవాన్ని చేయకుండానే వెళ్లిపోయారు. చెప్పిన సమయానికి రాని కలెక్టర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ ఆలస్యం అవుతుందన్న విషయం తెలిసినప్పుడు.. ముందే సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.