Begin typing your search above and press return to search.

జనసేన వర్సెస్ వైసీపీ: భాగవుతున్న రోడ్లు..!

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:38 AM GMT
జనసేన వర్సెస్ వైసీపీ: భాగవుతున్న రోడ్లు..!
X
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ, జనసేనల మధ్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ నాయకులు అంతేస్థాయిలో సమాధానం ఇస్తున్నారు. అయితే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగడంతో ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితిపై జనసేన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. రోడ్లు బాగాలేవంటూ జనసేన నాయకులు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే వైసీపీ మాత్రం జనసేన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

ఏపీలో చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభివృద్ధి విషయంలో తీవ్రంగా విమర్శలు చేశారు. అంతేకాకుండా కనీసం రోడ్లు కూడా నిర్మించలేని స్థితిలో ఉందని అన్నారు. అయితే తమ పార్టీ నాయకులు శ్రమదానం కార్యక్రమంతో రోడ్లు బాగు చేసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు.

జనసేన తలపెట్టిన కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం అడ్డు చెబుతోంది. కరోనా కారణంగా జనసేన కార్యక్రమానికి నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అందువల్ల ఆ పార్టీ నాయకులు ఎవరూ రోడ్లపైకి రావద్దని తెలిపింది. ఇందులో భాగంగా జనసేన నాయకులను ఎక్కడికక్కడా అరెస్టు చేస్తున్నారు. అయితే తాము ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయడం లేదని, శాంతియుతంగానే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నామని జనసేన నాయకులు చెబుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం కావాలనే అనుమతి లేదని అంటోందని విమర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ‘మేం ప్రజల కోసమే శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోడ్లు ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు బాగా చేయాలని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రోడ్లను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే శనివారం శాంతియుతంగా శ్రమదానం నిర్వహించాలనుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అసమర్థత వల్ల రోడ్ల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో జనసేన నాయకులు రోడ్లను బాగు చేసుకుంటున్నారు’ అని అన్నారు.

‘అయితే మేం తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తోంది. మేం చేసే శ్రమదానానికి అనుమతులు లేవని చెబుతున్నారు. తాము చేపట్టే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నాం. ఈనెల 27న రాష్ట్ర డీజీపీకి ఈ కార్యక్రమం గురించి తెలియజేశాం. అలాగే రాజమండ్రి అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియజేశాం. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం చేయొద్దని అడ్డు చెబుతున్నారని’ అన్నారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గనందున శ్రమదానం కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నిబందనలు సీఎంకు వర్తించవా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శనివారం విజయవాడ బెంజ్ సర్కిల్లో నిర్బంధం విధించి వేల మందితో చెత్త వాహనాలను తరలించడం కరోనా నిబంధనలకు విరుద్ధం కాదా..? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా జనసేన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేస్తున్నారు. శ్రమదానం కార్యక్రమానికి అనుమతి లేదంటూ కొందరిని ఇళ్లలో నుంచి వెళ్లనివ్వడం లేదు. ఇక కొందరు తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వం కొన్ని చోట్ల రోడ్లను బాగు చేయిస్తోందని వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు జనసేన నాయకులు. మా లక్ష్యం ప్రజలకు మంచి జరగడమేనని అంటున్నారు. ఏదీ ఏమైనా జనసేన శ్రమదానం కార్యక్రమంతో ప్రభుత్వం పంతానికి పోయినా ప్రజలకు మంచే జరుగుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.