Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ బీజేపీ ..శ్రీకాళహస్తి లో ఆగని వర్గ పోరు !

By:  Tupaki Desk   |   24 Dec 2019 9:01 AM GMT
వైసీపీ వర్సెస్ బీజేపీ ..శ్రీకాళహస్తి లో ఆగని వర్గ పోరు !
X
ప్రస్తుతం ఏపీ లో రాజధాని వార్ ఒక వైపు జరుగుతుంటే మరో వైపు కొందరు నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో వర్గ పోరు రోజురోజుకి ముదిరిపోతోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ తిరుగు లేని ఆధిక్యం లో ఉండటం తో టీడీపీ నేతలు కొంతమేర సైలెంట్ అయిపోయారు. ఈ సమయంలో శ్రీకాళహస్తి లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోంది.

బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అంటున్నారు. పట్టణంలోని వార్డు పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ని ఓ చోటా బీజేపీ నేత అడ్డుకోవడంతో నెలన్నర క్రితం ఈ వివాదం మొదలైంది అని తెలుస్తుంది. ఆ ఆరువాత ఎమ్మెల్యే ని అడ్డుకున్న బీజేపీ నేత పై పోలీసు కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి ఇక్కడ రోజూ గొడవలే. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఒకటికి రెండు మార్లు ఆందోళన కు దిగారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు కోలా ఆనంద్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమ నేతల అరెస్ట్ లకి కారణం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నే అంటూ బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువై పోతున్నాయంటూ చివరకు జిల్లా ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయినా వ్యవహారం సద్దుమణగక పోవడంతో, ఆయనకి ఉన్న పరిచయం తో నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ప్రధాని మోదీని సైతం కోలా ఆనంద్ కలవడం గమనించదగ్గ విషయం.

ఇకపోతే కోలా ఆనంద్ చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దగ్గరగా ఉన్నారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం బీజేపీ లోకి వెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన బరిలో దిగినా పెద్దగా ఓట్లు రాబట్ట లేకపోయారు. తాజాగా ఏపీ లో బీజేపీ బలం పెంచుకుంటుండగా, కాళహస్తి లో కోలా దూకుడు పెంచారు. అధికార వైసీపీ పై విరుచుకు పడుతుండడం జిల్లా లో చర్చనీయాంశం గా మారింది. కాళహస్తి లో అధికార పార్టీ కి తానే ప్రధాన ప్రత్యర్థిగా ముద్ర వేసుకోడానికి ఆయన ఇలా ముందుకెళుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.