Begin typing your search above and press return to search.

అక్కడ టీడీపీకి వైసీపీ మద్దతు... ?

By:  Tupaki Desk   |   4 Nov 2021 12:30 PM GMT
అక్కడ టీడీపీకి వైసీపీ మద్దతు... ?
X
తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా మండుతుంది అన్నది ఏపీ రాజకీయాలను కాస్తో కూస్తో ఎరిగిన వారికి పూర్తిగా తెలిసిన విషయమే. అలాంటి ఉప్పూ నిప్పూల మధ్య సయోధ్య అంటే ఆలోచించాల్సిన విషయం కాదు, షాక్ కి గురి కావాల్సిన అంశం. మహా విశాఖ నగర పాలక సంస్థలో 31వ వార్డులో జరిగే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైసీపీ ప్రకటించి టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఇలా ఎందుకు అంటే ఈ ఏడాది మొదట్లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి టీడీపీ తరఫున వానపల్లి రవి కుమార్ గెలిచారు. ఆయన కరోనాతో చనిపోయారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దాంతో తాజాగా జరగ‌నున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధిని పోటీకి పెట్టమని వైసీపీ స్పష్టం చేసింది.ప్రజా సేవ చేస్తూ మరణించివారి కుటుంబీకులు పోటీచేస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు కట్టుబడి వుందనిఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

దాంతో ఇక్కడ ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయదు. మరి మిగిలిన పార్టీలు కూడా తప్పుకుంటే రవికుమార్ కుటుంబం నుంచి పోటీ చేసేవారికే ఏకగ్రీవం అవుతుంది. ఇక ఇదే జీవీఎంసీలో 61వ వార్డు కార్పోరేటర్ దాడి సూర్యకుమారి గుండె నొప్పితో ఆ మధ్యన చనిపోయారు. దాంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యం అయింది. మరి దివంగత టీడీపీ కార్పోరేటర్ ఫ్యామిలీకి మద్దతుగా వైసీపీ పోటీకి పెట్టడం లేదు. టీడీపీ కూడా అలా చేస్తుందా లేక మాకేం సంబంధం లేదు అంటూ పోటీకి దిగుతుందా అన్నది చూడాలి.

ఒకవేళ టీడీపీ పోటీకి దిగితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకచోట మద్దతు తీసుకుని మరో చోట పోటీ పెట్టడం ఏమి విధానం అని ప్రశ్నలు వస్తాయి. అలాగే కడప జిల్లా బద్వేల్ లో మరణించిన వారి ఫ్యామిలీ కి మద్దతుగా పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ ఇక్కడ పోటీ చేసినా నిందలు తప్పవు. దాంతో టీడీపీ కూడా పోటీకి దిగకపోవచ్చు. అలాగే జనసేన కూడా ఇదే సూత్రం మేరకు బద్వేల్ నుంచి తప్పుకుంది. ఇపుడు రెండు చోట్లా జనసేన కూడా రంగంలో ఉండదు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు తాము దూరం అంటోంది. సో పోటీ పెడితే గిడితే బీజేపీ నుంచే ఉండొచ్చు. మొత్తానికి 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో ఈ రెండు సీట్లూ యధా ప్రకారం వైసీపీ టీడీపీలకే చెరొకటి దక్కనున్నాయని అంటున్నారు.