Begin typing your search above and press return to search.

వాలంటీర్లు ఇక దూరం...దూరం.. వైసీపీకి షాక్...?

By:  Tupaki Desk   |   17 Sep 2022 2:30 AM GMT
వాలంటీర్లు ఇక దూరం...దూరం.. వైసీపీకి షాక్...?
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది. వాలంటీర్లు ప్రభుత్వం అంటే తామే అన్నట్లుగా క్షేత్ర స్థాయిలో వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా చెపాలీ అంటే గ్రామాలలో ప్రజలకు  తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఎవరో తెలియకపోవచ్చు కానీ వాలంటీర్లు మాత్రం అందరికీ తెలుసు. అలా జనాలతో నేరుగా బంధం పెనవేసుకున్నారు వాలంటీర్లు.

ఇది బలమైన వ్యవస్థగా ఉంది. వైసీపీ సర్కార్ కి కానీ పార్టీకి కానీ వాలంటీర్లే ఆధారంగా ఉంటున్నారు. డైరెక్ట్ గా ప్రజలతో రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్న వాలంటీర్ల సేవలని కేవలం ప్రభుత్వం కార్యక్రమాలకే కాకుండా పార్టీ కోసం కూడా వాడేసుకుంటున్నారు అన్న ఫిర్యాదులు అయితే ఇప్పటికే ఉన్నాయి. వారిని పూర్తిగా వాడుకునే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అని కూడా అరోపణలు ఉన్నాయి.

జనాలతోవాలంటీర్ల కనెక్షన్ కట్ చేయకపోతే సార్వత్రిక  ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ప్రతిపక్షాలు గుర్తించాయి. అందుకే అవి దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. లోకల్ బాడీ ఎన్నికల వేళ చేసిన ఫిర్యాదులతోనే వారి సేవలను ఎన్నికల కోసం వాడుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే వాలంటీర్లను ఏదో ఒక దారిన వాడుకున్నారు.

ఏపీ వ్యాప్తంగా 2.7 లక్షల దాకా ఉన్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉంటూ ప్రజలను బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయుఇ. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పధకాలు దక్కవు అన్నట్లుగా వారు జనాలకు చెబుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. దాంతో వారిని అన్నింటికీ దూరం పెట్టాలని ఎన్నికల సంఘం తాజాగా మరోమారు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎంకే మీనా ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

వాలంటీర్లతో ఎన్నికలకు సంబంధించి ఏ పనీ చేయించవద్దని జిల్లా ఎన్నికల అధికారులుగా ఉంటున్న కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. ప్రస్తుతం సాగుతున్న ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం కార్యక్రమానికి వీరిని దూరం పెట్టాలని కూడా సూచించినట్లుగా చెబుతున్నారు. అలాగే వాలంటీర్లు ఎవరైనా అభ్యర్ధులకు ఏజెంట్లుగా అసలు ఉండరాదని కూడా మీనా ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా వీరిని పూర్తిగా పక్కన పెట్టాలని కోరారు. మొత్తానికి చూస్తే వాలంటీర్లతో అన్నీ చేయించుకుంటున్న వైసీపీకి ఇపుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది అంటున్నారు. వాలంటీర్ల వల్లనే తమకు అంతా మేలు జరుగుతుందని ఆలోచిస్తూ మాస్టర్ ప్లాన్స్ వేస్తున్న వైసీపీకి ఇది గట్టి షాక్ అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.