సామాజిక న్యాయం.. ప్రాంతీయ న్యాయం.. పార్టీ న్యాయం.. సమ న్యాయం.. అన్యాయమే

Wed May 18 2022 21:00:01 GMT+0530 (IST)

ycp news update

ప్రాంతాల వారీగా ప్రగతి విషయంలో ఎక్కువగా వినిపించే పదం సమ న్యాయం.. రాజకీయాల్లో ఎక్కువగా కనిపించే పదం సామాజిక న్యాయం.. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా శిరసా పాటించాల్సిన నియమంగా మారిపోయింది. లేదంటే ప్రజల్లో ఓ రకమైన ఆలోచన.. ప్రతిపక్షాలు గిట్టని మీడియాకు అందులోనూ సోషల్ మీడియాకు దొరికిపోతారు. అందుకే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి.. పార్టీ పదవుల్లో ఏ వర్గం వారు ఎందరు ఉన్నారో అనేది నిశితంగా పరిశీలిస్తుంటారు. సమతూకం ఆలోచనలు పక్కనపెట్టి.. చాలావరకు పార్టీలు విమర్శలకు భయపడో.. పార్టీ అందరిదీ అని చెప్పుకోవడానికో ఏమో కానీ భిన్న వర్గాల వారికి చోటిస్తుంటాయి.తాజాగా ఏపీ రాజ్యసభ అభ్యర్థులను చూస్తే..

ఆంధ్రప్రదేశ్ లో భర్తీ కావాల్సి ఉన్న నాలుగు రాజ్య సభ సీట్లకు అధికార వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తే ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీలకు ఇచ్చింది. అయితే ఇందులో ఓ తిరకాసుంది. ఇద్దరు ఓసీలు ఒకే సామాజిక వర్గం (రెడ్డి). ఒకరు తెలంగాణ మరొకరు రాయలసీమ. ఇద్దరు బీసీల్లో ఒకరు యాదవ్ (బీద మస్తాన్ రావు) మరొకరు కురుమ (ఆర్.క్రిష్ణయ్య). మస్తాన్ రావు.. నెల్లూరు జిల్లా నేత కాగా క్రిష్ణయ్య తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వాసి. వీరిద్దరి సామాజిక వర్గాలు చాలా సామీప్యత ఉన్నవి. అయితే ఒక్కటిగా కలిపి మాత్రం చూడలేమని చెబుతున్నారు. దీన్నిబట్టి వైసీపీ ఎంపిక చేసిన ఈ అభ్యర్థుల్లో 50 శాతం ఓసీ రెడ్డి సామాజికవర్గానికే వెళ్లాయి. బీసీల్లో ఇద్దరికి ఇచ్చినా.. వారు సారూప్య సామాజికవర్గాలకు చెందినవారు కావడం కొంత చర్చనీయాంశమైంది. దీనిప్రకారం చూస్తే.. బీసీల్లో మిగతా సామాజికవర్గాలకు చేయిచినట్లే. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర బీసీలకు. వారి కోటాను వేరొకరు తన్నుకుపోయినట్లు తెలుస్తోంది.

ఓసీల్లో మంత్రి పదవులు పోయినవారి కులాలకు ఇవ్వొచ్చుగా?

ఏపీలో ఇద్దరు ఓసీలు అదీ ఒకే సామాజికవర్గం వారికి రాజ్య సభ సభ్యత్వం ఇవ్వడం కంటే.. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో ఉన్న ఒక్క బెర్తూ పోయిన కమ్మ వైశ్య కులాలకు అవకాశం ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు బ్రాహ్మణ సామాజికవర్గంకు  మొదటినుంచి మంత్రివర్గంలో చోటులేదు. ఈసారి వారినుంచి ఎవరికైనా ఎంపీ సీటు ఇస్తే బాగుండేదనే వాదన ఉంది.

ఎంపికలో మకతిక

నాలుగు ఎంపీ సీట్లకు ఇద్దరు తెలంగాణ వాసులను ఎంపిక చేయడం.. అందులోనూ ఒకరు ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులను వాదిస్తున్న న్యాయవాది కావడం మరొకరు 2014-19 మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన సభకు హాజరైన ఎన్నికల సమయంలో టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆర్.క్రిష్ణయ్య కావడం గమనార్హం. ఇంకో విషయం.. ఆర్.క్రిష్ణయ్య బీద మస్తాన్ రావు ఇద్దరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే. అంటే నాలుగు సీట్లలో రెండు అంటే 50 శాతం టీడీపీ మాజీలకు పోయాయి. మిగతా రెండింటి ఒకటి.. సొంత మనిషి విజయసాయిరెడ్డికి రిజర్వ్ అయిపోయింది.

మరి ‘మర్రి’లాంటివారి కేదీ అవకాశం..?

రాయలసీమ వంటి చోట్లా.. బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తూ గత ఎన్నికల్లో ఏపీలో జగన్ పెద్ద ప్రయోగమే చేశారు. ఆంధ్రా ప్రాంతంలోనూ ఆయన బీసీలకు పెద్ద ఎత్తున టిక్కెట్లిచ్చారు. ఇలాంటివాటిలో చిలకలూరిపేట ఒకటి. ఇక్కడ టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుపై వ్యతిరేకత కలిసొచ్చి.. వైసీపీ అభ్యర్థి విడదల రజనీ ఘన విజయం సాధించారు. అయితే చిలకలూరిపేటలో అంతకుముందు నుంచీ పార్టీని నమ్ముకుని రూ.కోట్లు ఖర్చెపెట్టి బలోపేతం చేసింది మర్రి రాజశేఖర్. బీసీలకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఓసీ అయిన ఆయనకు అవకాశం దక్కలేదు. దీనికిగాను మర్రి రాజశేఖర్ కు న్యాయం చేస్తానని మంత్రి పదవి ఇస్తానని నేరుగా బహిరంగ సభలోనే జగన్ చెప్పారు. కానీ మూడేళ్లయినా మర్రి రాజశేఖర్ కు న్యాయం జరగలేదు.