Begin typing your search above and press return to search.

ఎంపీ ఫిర్యాదుకు విలువుందా ?

By:  Tupaki Desk   |   9 July 2022 6:45 AM GMT
ఎంపీ ఫిర్యాదుకు విలువుందా ?
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుకు విలువ ఉందా అనేది ఇపుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తనను భౌతికంగా నిర్మూలించేందుకు ఏపీ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీవెన్ రవీంద్ర ప్రయత్నించినట్లు ఎంపీ ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసు కమీషనర్ రాకేష్ ఆస్తానా కు రాసిన లేఖలో తాను చెప్పిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని రిక్వెస్టు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలాకాలంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వంపై ప్రతిరోజు ఎంపీ బురదచల్లేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా తప్పులుంటే ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం వేరు. చేయాలి కాబట్టి అదేపనిగా ఆరోపణలు, విమర్శలు చేయటం వేరు.

ఇపుడు అసలు విషయానికి వస్తే హైదరాబాద్ నుండి భీమవరానికి రైలులో వెళ్ళేసమయంలో సత్తెనపల్లి దగ్గర తాను ప్రయాణిస్తున్న భోగీకి నిప్పుపెట్టి తనను కాల్చి చంపాలని జగన్ ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తున్నారు.

ఇక్కడే ఎంపీ ఆరోపణలు ఎంత బేస్ లెస్సో అర్ధమవుతోంది. ఎందుకంటే ఎంపీ ప్రయాణించిన భోగీలో ఎంపీ తప్ప ఇంకెవరు ప్రయాణం చేయరా ? ఎంపీని చంపటానికి భోగీకి నిప్పు పెడితే మరి మిగిలిన ప్రయాణీకుల సంగతి ఏమిటి ? అసలు భోగీకి నిప్పుపెట్టి తనను చంపాలని జగన్ ప్లాన్ చేశారంటున్న ఎంపీ అందుకు ఆధారాలను మాత్రం చూపటంలేదు. ఏదో నోటికొచ్చిన, ఊహాజనితమైన ఆరోపణలు చేసేస్తు ప్రతిరోజు నానా రచ్చ చేస్తున్నారని అర్ధమైపోతోంది.

డ్యూటిలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి విషయంలో ఎంపీతో పాటు కొడుకు భరత్+పీఏ శాస్త్రి+భద్రతా సిబ్బందిపై కేసు నమోదైంది. కేసును కొట్టేయమని ఎంపీ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. ముందు ముందు ఈ కేసు తన మెడకు బాగా చుట్టుకుంటుందన్న విషయం ఎంపీకి అర్ధమైపోయింది.

అందుకనే ఎదురుకేసులు పెడదామన్న ఉద్దేశ్యంతోనే ఏపీ పోలీసులు, స్టీఫెన్ రవీంద్రపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే ఏ పోలీసులైనా కేసు నమోదుచేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.