Begin typing your search above and press return to search.

వైసీపీ కొంప ముంచుతున్న ఎంపీలు...?

By:  Tupaki Desk   |   5 Aug 2022 10:30 AM GMT
వైసీపీ కొంప ముంచుతున్న ఎంపీలు...?
X
సీపీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ. అధికారంలోకి రావడం వెనక పదేళ్ల కష్టం ఉంది. తీరా అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు, బంపర్ మెజారిటీతో వైసీపీ గద్దెనెక్కింది. అంతేనా ఏకంగా 22 మంది ఎంపీలు వైసీపీ తరఫున లోక్ సభకు గెలిచారు. దాంతో ఇంతమందిని సర్దుకుని సంతరించే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఎప్పటికపుడు తడబాటు పడుతోంది.

ఎంపీలు నిజానికి ఢిల్లీలో ఉంటారు. ఇక ఎంపీ అనగానే మన పార్టీలు సంప్రదాయ రాజకీయానికి అలవాటు పడిన వారు అంతా ఎంపిక చేసేసి బిగ్ షాట్స్ నే. అంటే వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలో చేరేవారికే ఎంపీ సీట్లు ఇస్తున్నారు. అలాగే సామాజిక వర్గాలు, ఇతర విషయాలు చూసుకుంటున్నారు. దాంతో ఎంపీలు ఏదో విధంగా నెగ్గినా తమ సొంత పంధాను వీడడంలేదు.

కొందరు సైలెంట్ గా ఉంటూ తమ పనేంటో పాటేందో చూసుకుంటూంటే మరికొందరు ఢిల్లీ హద్దులు దాటి రాకుండా ఉన్నారు. ఇంకొందరు నియఓజకవర్గాలలో ఎమ్మెల్యేలతో తగాయిదాలు పడుతూంటే కొందరు పూర్వకాలం దూకుడుని మళ్ళీ ప్రదర్శిస్తూ తమ పరువూ పార్టీ పరువూ తీస్తున్నారు. ఇక వైసీపీకి ఆది నుంచి ఎమ్మెల్యేల కంటే కూడా ఎంపీలతోనే చిక్కులూ చికాకులు వస్తున్నాయని అంటున్నారు.

దీనికి దారి తీసింది నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన గెలిచిన ఆరు నెలల తేడాలోనే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ రోజుకీ తన కత్తికి ఎదురులేదని ఢిల్లీలో రచ్చ చేస్తూనే ఉన్నారు. ఆయన తలనొప్పితో వైసీపీ హై కమాండ్ కి బొప్పి కడుతోంది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. ఇక మరి కొందరు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడుతారని కూడా ప్రచారం సాగుతోంది.

కొందరు అయితే డైరెక్ట్ గానే సొంత ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితిలో అధినాయకత్వం లేదు. ఇదిలా ఉండగా ఏరి కోరి సీటు ఇచ్చిన మాజీ పోలీస్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇపుడు తన పరువుతో పాటు పార్టీ పరువు కూడా తీశారని అంటున్నారు. మాధవ్ వ్యవహారం ఎలా ఉంది అంటే కక్కలేక మింగలేక అన్నట్లుగా అని వైసీపీ నేతలే చెబుతున్నారు.

ఆయన్ని సమర్ధించలేరు. అలాగని చర్యలు తీసుకోలేరు. దాంతో వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇంకో వైపు చూస్తే ఇదే విషయం మీద విపక్షాలు చేయాల్సిన యాగీ అంతా చేసి వైసీపీ పరువును ఏపీలో పీకి పందిరేశాయి. వైసీపీ అంటేనే రాసలీలల పార్టీ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయంగా ఆ పార్టీకి షాక్ కొట్టించేవే. మాధవ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుందని అంటున్నారు.

ఇక వైసీపీ అధినాయకత్వం కూడా మాధవ్ విషయంలో సీరియస్ గా ఉంది అంటున్నారు. అయితే ఆయన మీద చర్యలు తీసుకుంటే ఆయన కంటే ముందే ఆడియో టేపులతో దొరికిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబుల సంగతేంటి అన్న ప్రశ్న కూడా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. పైగా వెనకబడిన సామాజికవర్గానికి చెందిన మాధవ్ మీద యాక్షన్ తీసుకుని ఆయన్ని బలి చేస్తే అది వైసీపీకి రాజకీయంగా పుట్టె ముంచే పరిణామమే అంటున్నారు.

మొత్తానికి ఒక ఎంపీగా రాజు గారు ఇపుడు నస పెడుతున్నారు. రేపటి రోజున మాధవ్ మీద యాక్షన్ తీసుకుంటే ఆయన కూడా చెవిలో జోరిగ అవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఇంకెందరు ఎంపీలు ఇలా వైసీపీ కొంప ముంచుతారో అన్న బెంగ బెదురు అయితే ఉందిట.