Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత...లోక్‌ సభ స్పీకర్‌ కు ఫిర్యాదు !

By:  Tupaki Desk   |   3 July 2020 11:50 AM GMT
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత...లోక్‌ సభ స్పీకర్‌ కు ఫిర్యాదు !
X
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలపై విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎంపీ పై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాను కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది

ఎంపీల బృందంలో వైఎస్సార్ ‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత - ఎంపీ విజయసాయిరెడ్డి - లోక్‌ సభ పక్షనేత మిథున్ రెడ్డి - ఎంపీలు నందిగం సురేష్ - లావు శ్రీకృష్ణదేవరాయలు - మార్గాని భరత్‌ ఉన్నారు. ఇక రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే పార్టీ నుంచి షోకాజు నోటీసు అందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో స్పీకర్‌ నిర్ణయం కీలకం కానుంది.

పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని గత నెల 22వ తేదీన ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణంరాజు సాంకేతిక అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత గత నెల 29వ తేదీన ఏపీ సీఎం జగన్ కు రఘురామకృష్ణంరాజు ఆరు పేజీల లేఖను రాశాడు. షోకాజ్ కు సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైసీపీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇవాళ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వంద పేజీలతో స్పీకర్ కు రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు చేసింది.