Begin typing your search above and press return to search.

టీడీపీలోకి వలసలు...తమ్ముళ్ళ సంగతేంటి...?

By:  Tupaki Desk   |   14 April 2022 11:06 AM GMT
టీడీపీలోకి వలసలు...తమ్ముళ్ళ సంగతేంటి...?
X
తెలుగుదేశం పార్టీ తాను కార్యకర్తలను నాయకులుగా తీర్చి దిద్దే అతి పెద్ద కర్మాగారం అని చెప్పుకుంటుంది. ఆ పార్టీది ఫార్టీ ఇయర్స్ ఎక్స్ పీరియన్స్. అలాంటి పార్టీ వలసల కోసం ఎదురుచూస్తోందా. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తేనే కానీ టీడీపీ బండి నడవదా. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన వలసల మాటలు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి.

పెద్ద ఎత్తున వలసలు టీడీపీ వైపుగా ఉంటాయని గంటా హింట్ ఇచ్చారు. గంటా రాజకీయ చాణక్యుడు. ఆయన మామూలుగా మాట్లాడరు. ఆయన కామెంట్ చేస్తే దాని వెనక ఆధారాలు అన్నీ ఉంటాయి. మరి దీన్ని లోతుగా ఆలోచించాల్సిందే అంటున్నారు. గంటా చెప్పిన దాని ప్రకారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు. వారు వైసీపీలో ఉన్నవారా లేక ఇతర పార్టీల వారా. ఏపీలో చూస్తే అన్ని విధాలుగా కిక్కిరిసి ఉన్నది వైసీపీ మాత్రమే.

ఆ పార్టీలోనే మొత్తానికి మొత్తం నాయకులు సర్దుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన మంత్రి వర్గ విస్తరణతో చాలా మంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాంటి వారు ఇపుడు పక్కన చూపులు చూస్తున్నారా. గంటా మాటలను బట్టి టీడీపీ వద్ద ఇలాంటి అసంతృప్తుల జాబితా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇంకా రెండేళ్ళ వరకూ వైసీపీ చేతిలో అధికారం ఉంది.

అందువల్ల ఎవరు ఈ రోజుకు జంప్ చేయడానికి అయినా ఆలోచిస్తారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం చాలా మంది నేతలు గోడ దూకుతారు. ఈ విషయం ఎపుడూ ఉన్నదే. అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు ఎన్నికల సమయానికి టీడీపీలో చేరితే వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అప్పటిదాకా నమ్ముకున్న తమ్ముళ్ల పరిస్థితి ఏంటి.

అదే విధంగా ఈ రోజు వైసీపీలో అసమ్మతి చెలరేగడానికి కారణం మంత్రి పదవులు రాలేదనే కదా. మరి ఆ పదవులకు టీడీపీలో గ్యారంటీ ఉంటుందా. అలా బయట నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చుకుంటూ పోతే మొదటి నుంచి ఉన్న వారి ఆశలు ఏం కావాలి. ఇలా 2014 నుంచి 2019 టైమ్ లో చేసే టీడీపీ ఎన్నికల్లో ఓడింది. ఇపుడు టీడీపీ అలాంటి తప్పు చేస్తుందా అన్నదే ఆలోచించాలి.

ఈసారి మాత్రం టీడీపీ అధినాయకత్వం ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటుంది కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు అనే అంటున్నారు. జగన్ మాదిరిగానే సొంత పార్టీ వారికే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటోందిట. మరి కొత్తగా వచ్చిన వారు అలా పక్కన ఉండడమేనా. అలా అయితే ఎందుకు పార్టీ మారుతారు. అంటే వైసీపీకి జనాదరణ లేదని, ఓడిపోతుందని తెలిసిన మరుక్షణం వారంతా దూకేది పక్క పార్టీలోకే. దానికి ఏ లాజిక్ కూడా అవసరం లేదు. బహుశా ఆ ధైర్యంతోనే గంటా నోట ఈ మాటలు వచ్చి ఉంటాయని అంటున్నారు.