Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్రేషన్ : మాకు తిట్లు... ఆయన‌కు పొగడ్తలు...?

By:  Tupaki Desk   |   23 July 2022 11:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్రేషన్ : మాకు తిట్లు... ఆయన‌కు  పొగడ్తలు...?
X
అవును మరి నేరకపోయి ఎమ్మెల్యే అయ్యాను అని అనుకునే పరిస్థితి అయితే ఎవరికీ రాకూడదు. లక్షల్లో ఒకరికి దక్కే అందలం ఎక్కామన్న ఆనందం అయితే గడచిన మూడేళ్లో వైసీపీ ఎమ్మెల్యేలలో లేదు అనే అంటున్నారు. మేము జస్ట్ ఉత్సవ విగ్రహంగా అయ్యాం, ఇక నియోజకవర్గంలో చూస్తే రూపాయి పని కూడా చేయలేకపోయాం, ఇపుడు గడప గడపకు మన ప్రభుత్వం అని ఆర్భాటం చేస్తే జనాలు ముఖాల మీదనే తిట్లు లంకించుకుంటున్నారు అని వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా మధనపడుతున్నారుట.

గత మూడు నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరిట ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి అధినాయకత్వం ఎమ్మెల్యేలను జనాల వద్దకు పంపుతోంది. అయితే మొదటి రోజే జనాల మూడ్ చూసేసిన వారు మెల్లగా జారుకుంటున్నారు. కారణాలు వారికి తెలుసు. అధినాయకత్వానికి కూడా తెలుసు. రోడ్లు బాలేవు, కాలువలు అలాగే ఉన్నాయి. చిన్నపాటి అభివృద్ధి కూడా చేయలేకపోయారు. ఇపుడు జనాల వద్దకు వెళ్తే వారు చేసే విమర్శలు, తిట్టే తిట్లు తమకు అవసరమా అన్న ధోరణిలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారుట.

తీరా ప్రజల వద్దకు వెళ్తే వారు చెప్పే ఏ ఒక్క సమస్యను తీర్చే పరిస్థితి తమకు లేదని వాపోతున్నారు. మూడేళ్ళుగా ఎమ్మెల్యేలకు ఖర్చు చేసేందుకు నియోజకవర్గం నిధులు ఇవ్వలేదు. దాంతో ఏ చిన్నపాటి పని కూడా తాము స్వయంగా చేయలేకపోతున్నామని వారు అంటున్నారు. ఇక తాము ఎందుకు వెళ్లలేదు అని నిలదీసి మరీ వైసీపీ హై కమాండ్ క్లాస్ తీసుకుంటోందని, సర్వేలు చేయిస్తున్నామని, ఎవరు బాగా జనంలో తిరిగితే వారికే మళ్లీ టికెట్లు సీట్లు అని అంటోందని వారు గోడుమంటున్నారు.

ఒక విధంగా ఇది అతి పెద్ద టార్చర్ గా ఉందని సీమ జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే అంటే గోదావరి జిల్లాలకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే మేము జనాల్లో తిరిగి తిట్టించుకుంటే సీఎం గారికి పొగడ్తలు వస్తున్నాయని అంటున్నారు. ఆయన మటుకు మంచోడు, మేము అక్కడికి జనాలకు చెడ్డ అయిపోయామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా జనాల మధ్యకు వెళ్లడం దండుగే అని కూడా కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారుట. జనాల వద్దకు వెళ్తే వారు ఏమంటారో మాకు తెలుసు అని కూడా చెబుతున్నారు. ఇంకొదరు అయితే వెళ్లాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. ఇలా తాము అన్ని రకాలుగా ఇబ్బందులో ఉంటే సర్వేలు పేరు చెప్పి గ్రాఫ్ పడిపోయింది అని చెబుతూ క్లాసులు తీసుకోవడం ఏంటి మహా ప్రభో అని కూడా మండిపోతున్నారు.

ఇక గత మూడేళ్లలో ఎమ్మెల్యేలు తమ శక్తికి మించి ఖర్చు చేసి లోకల్ బాడీ ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లో పార్టీని గెలిపించి చేయి కాల్చుకున్నారని కూడా చెబుతున్నారు ఇపుడు అప్పుల పాలు అయిన వారు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు అంటే అది ఆశ్చర్యమే అని చెప్పాలి. ఒక విధంగా పవర్ లో ఉన్న పార్టీలో ఉంటే మేలు అని పట్టినదల్లా బంగారం అనుకుంటారు కానీ మూడేళ్ళుగా గెలిచిన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల తీరు ఇలా ఉందంటే లోపం ఎక్కడ ఉందో అధినాయకత్వం తెలుసుకోవాలని అంటున్నారు.

మరి జగన్ అయితే సర్వేలను నమ్ముకున్నారు. ఎవరి గడప తొక్కితే వారే హీరో అని ఆయన లెక్క వేస్తున్నరు. ఆ సాహసం చేయలేమని చేతులెత్తేస్తున్న వారు బలమైన నేతలుగా ఉన్న హై కమాండ్ కి ఆనడంలేదు, మరి ఇపుడు తమ బాధలేంటో ఒక్కొక్కరుగా బయటకు వెళ్లబోసుకుంటున్నారు. మరి జగన్ దీనికి ఏ రకమైన పరిష్కారం చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఒక విషయం ఏ ఎమ్మెల్యే కూడా జనాలకు దూరంగా ఉండాలనుకోరు, జనం వద్దకు వెళ్లినపుడు సమస్య చెప్పినపుడు తీర్చే స్థితిలో వారు ఉండాలి. మరి వారికి ఆ పొజిషన్ కల్పించే విధంగా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.